హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : నిజామాబాద్ జిల్లాలో జరిగిన షేక్ రియాజ్ ఎన్కౌంటర్ సందర్భంగా కుటుంబసభ్యులపై పోలీసులు జరిపిన అమానుష ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి, సీబీఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని మృతుడి తల్లి, భార్య, కుటుంబసభ్యులు జాతీయ మహిళా కమిషన్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు విజ్ఞప్తిచేశారు. సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో న్యాయవాది సమీర్ అలీతో కలిసి శుక్రవారం షేక్ రియాజ్ తల్లి జరీనాబేగం (60), భార్య సనోబర్ నజ్మాన్ (37), కుమార్తె, కుమారుడు ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖ శర్మ, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ ప్రియాంక్ కనుంగోలను కలిసి నిజామాబాద్ పోలీసులపై ఫిర్యాదు చేశారు.
షేక్ రియాజ్ ఎన్కౌంటర్ అనంతరం విచారణ పేరుతో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి తమను క్రూరంగా హింసించారని, మహిళలని చూడకుండా మగ పోలీసులు తమపై నీచంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. 60 ఏండ్ల ఉన్న తనను అత్యంత దారుణంగా హింసించారని, తన ప్రైవేటు శరీరభాగాలపై మహిళా పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారని జరీనాబేగం ఆరోపించారు. ఎన్కౌంటర్లో భర్త చనిపోయారన్న బాధలో ఉన్న తన కోడలు సనోబర్ నజ్మీన్పై స్టేషన్లో పోలీసు అధికారులు, సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారని వివరించారు. అంతేకాకుండా చిన్నపిల్లలని చూడకుండా మనవడు(7), మనవరాలి(5)ని స్టేషన్లో వేలాడతీసి, క్రూరంగా కొట్టారని వాపోయారు. ఈ ఘటనలో డీజీపీ, నిజామాబాద్ పోలీసు కమిషనర్‌పై విచారణ జరపాలని కోరారు. మహిళలపై ఇంత క్రూరంగా లైంగిక దాడులు జరిగినప్పటికీ తెలంగాణ మహిళా కమిషన్‌పై విశ్వాసం లేకపోవడంతోనే జాతీయ మహిళా కమిషన్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను ఆశ్రయించినట్టు షేక్ రియాజ్ కుటుంబసభ్యులు పేర్కొన్నారు.