షాద్‌నగర్, సెప్టెంబర్ 13: రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్లో 10 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, పాడి కౌశిక్‌రెడ్డి మధ్య వివాదం రాజుకున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి బృందాన్ని హైదరాబాద్ నుంచి కేశంపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సైబారాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే హోంగార్డు రమేశ్ కేశంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్యయాదవ్ కుమారులు వై రవియాదవ్, వై మురళీయాదవ్‌తోపాటు నవీన్, జమాల్‌ఖాన్, లక్ష్మణ్, జగన్, బండ నిరంజన్, మల్లయ్య, సుధాకర్, వెంకట్‌రెడ్డి, ధన్రాజ్లపై సెక్షన్ 126(2), 132, 189 (2), 191 (2), ఆర్/డబ్ల్యూ 190బీఎన్ఎస్, 3పీడీపీపీఏకింద కేసు నమోదు చేశారు. కేశంపేట మండలం కొత్తపేటలో ఎమ్మెల్యేల బృందాన్ని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవడంతో పాటు వాహనం అద్దాలను పగులగొట్టారని, రాత్రి వేళలో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగి విధులకు ఆటంకం కలిగించారని హోంగార్డు ఫిర్యాదులో పేర్కొన్నారు.