హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : శాసనమండలి సభ్యుడు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదు వచ్చినప్పటికీ ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. మల్లన్న వ్యాఖ్యలపై సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని కే అరవింద్‌రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కే శరత్ శుక్రవారం విచారణ జరిపారు. ఈ నెల 2న వరంగల్‌లో బీసీ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో మల్లన్న ఓ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ఆ వ్యాఖ్యలపై సిద్దిపేట పోలీసులతోపాటు డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో మల్లన్నపై ఎందుకు కేసు నమోదు చేయలేదో వివరించాలని పోలీసులను ఆదేశించిన జస్టిస్ శరత్.. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.