బూర్గంపహాడ్, డిసెంబర్ 2 : బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి భర్తపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకున్నది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపహాడ్ మండలం సోంపల్లిలో సోడె వీరభ్రదం తన భార్య లీలను సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీచేయిస్తున్నాడు. ఈ క్రమంలో బూర్గంపహాడ్ పోలీసులు వీరభద్రంకు ఫోన్ చేసి, స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. దీంతో వీరభద్రం ఓ బీఆర్ఎస్ నాయకుడితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. స్టేషన్లో ఓ అధికారి వీరభద్రంను పరోక్షంగా బెదిరిస్తూ.. ‘నీ భార్య నామినేషన్ విత్‌డ్రా చేయించాలి. స్థానికంగా అధికార పార్టీకి చెందిన నేతను కలవాలి’ అని హుకుం జారీ చేశాడు.
‘నేనేం నేరం చేశాను. నేను ఎందుకు ఆయన్ను కలవాలి’అని ప్రశ్నించడంతో పోలీసులు బెదిరింపులకు దిగినట్టు సోడె వీరభ్రదం తెలిపాడు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుకు ఫోన్‌చేసి వివరించినట్టు తెలిపాడు. దీని వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉన్నట్టు ఆయన అనుమానం వ్యక్తంచేశారు. కాగా.. బూర్గంపహాడ్ ఎస్సై మేడా ప్రసాద్‌ను వివరణ కోరగా.. సోంపల్లిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ నిమిత్తం అతడితోపాటు కృష్ణ, కాంచన అనే ఇద్దరిని స్టేషన్‌కు పిలిపించినట్టు తెలిపారు. అతడి భార్య నామినేషన్ అంశం తమకు తెలియదని, తమపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు లేవని పేర్కొన్నారు.
సోంపల్లిలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గెలుపు ఖాయం కావడంతోనే అధికార పార్టీ నేతలు పోలీసుల సహాయంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో పాల్వంచ సీఐకి ఫోన్ ద్వారా పోలీసుల తీరుపై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అధికార పార్టీ నేతల అండ చూసుకుని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం మంచి పద్ధతి కాదని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని, దీన్ని జీర్ణించుకోలేకనే అధికార పార్టీ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.