హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : ఓ కేసు విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సిటీ సెంటర్, కేబీఆర్పార్క్ వంటి ప్రాంతాల్లో అడుగడుగునా పోలీసులు మోహరించారు. కేసీఆర్ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఎక్కడపడితే అక్కడ వారిని అడ్డుకొనేందుకు బారికేడ్లు పెట్టారు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నందినగర్ ప్రజలను, బసవతారకం దవాఖానకు వచ్చివెళ్లే రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. నందినగర్ పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించే రోడ్ల వద్ద ఆధార్‌కార్డు, ఇతర గుర్తింపు కార్డులు ఉంటేనే లోపలికి అనుమతించారు. దీంతో ఆ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ స్థంభించింది. రెండుచోట్ల వాహనదారులు రోడ్డుపై పడిపోయారు. బసవతారకం దవాఖాన పక్కనే ఉన్న గణేశుడి ఆలయం దగ్గర, గౌరిశంకర్ వైన్స్ పక్కన రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాహనదారులకు స్వల్ప గాయాలయ్యాయి.
కేసీఆర్ విచారణను కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులకు సైతం చేదు అనుభవం ఎదురైంది. ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు.. బారికేడ్లు అడ్డంపెట్టి జర్నలిస్టులను కూడా నిలువరించారు. వార్తను కవర్ చేయడానికి వెళ్తున్నామని.. ఐడీకార్డులు చూపించినా కనికరించలేదు. దీంతో రోప్‌పార్టీని అడ్డుకొని కాలినడకనే వెళ్లి.. కేసీఆర్ నివాసం వద్ద ఏర్పాటుచేసిన మీడియా పాయింట్లకు చేరుకున్నారు. ఇక నందినగర్‌లో ఇవ్వాల్సిన కొరియర్స్, ఫుడ్ పార్సిళ్లకు జొమాటో, స్విగ్గి, ర్యాపిడో డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎటువైపు వెళ్లినా బారికేడ్లు అడ్డుతగిలి.. పోలీసులు అనుమతించకపోవడంతో తమ రైడ్లు నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేసుకున్నామని వాపోయారు. బసవతారకం దవాఖాన పక్కన, కేసీఆర్ నివాసం దారిలో ఉండే డార్మటరీల్లో ఉన్న రోగులు, వారి బంధువులు సైతం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి ఆ రూట్‌ను మూసివేసి.. కేసీఆర్ తన నివాసానికి చేరుకున్న తర్వాత క్లియర్ చేశారు. అప్పటివరకూ వారు ఆ గదుల్లోనే ఉండిపోయారు.
బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంతో జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ ప్రత్యేకంగా మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. ఆ రూట్లలో అన్నిచోట్ల చెకింగ్ పాయింట్స్పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలను గుర్తించేపనిలో నిమగ్నమయ్యారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి వరుసగా తెలంగాణ సమాజం, కేసీఆర్‌కు వ్యతిరేకంగా కథనాలు వస్తుండటంతో రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ఆఫీసు వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు.