జమ్మికుంట, జనవరి 19 : ‘ఉద్యోగం పీకేపిస్తా.. బట్టలిడిపిస్తా’నంటూ ఓ పోలీస్ అధికారి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చిందులు తొక్కారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్కు చెందిన పోలీసు అధికారి సాటి ప్రభుత్వ ఉద్యోగి అని కూడా చూడకుండా దౌర్జన్యానికి దిగారు. సదరు ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల నుంచి మంజూరు పత్రం, దరఖాస్తు తీసుకుని ఇసుక టోకెన్లు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 8న హుజూరాబాద్ డివిజన్లోని ఓ గ్రామానికి చెందిన లబ్ధిదారుడు ఇసుక కావాలని కార్యదర్శికి దరఖాస్తు చేసుకోగా టోకెన్ జారీ చేశాడు.
ఇసుక కూపన్ జారీ చేసిన కార్యదర్శికి ఓ పోలీసు అధికారి ఫోన్ చేసి ఆగ్రహంతో ఊగిపోయారు. ‘ఎప్పటి డేట్ ఎప్పుడు రాసిస్తున్నవ్? తమాషాలు గిట్ల జేస్తున్నవా? ఉద్యోగం చేయ బుద్దయితలేదా? ఏమనుకుంటున్నవ్ నువ్వు.. నీ ఉద్యోగం పీకేపిస్తా.. నీ బట్టలిడిపిస్తా.. తమాషాలుచేస్తున్నవా? వెంటనే స్టేషన్కు రా’ అని మండిపడ్డారు. వణుకుతూ స్టేషన్కు వెళ్లిన కార్యదర్శిని అక్కడ కూడా ఇష్టానుసారంగా తిట్టినట్టు తెలిసింది. ఈ విషయాన్ని బాధిత కార్యదర్శి తన సంఘం బాధ్యులకు చెప్పుకున్నట్టు సమాచారం. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు మంగళవారం మండల కేంద్రంలో సమావేశం కానున్నట్టు తెలిసింది. పోలీసు అధికారి క్షమాపణ చెప్పేంతవరకు ఇసుక కూపన్లు జారీ చేసేది లేదని తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.