హైదరాబాద్ సిటీబ్యూరో/బడంగ్పేట్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : ‘ఆందోళనలు కొనసాగిస్తే కేసులు పెడ్తాం.. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి.. ముందు దీక్షాశిబిరాలు ఖాళీచేసి వెళ్లిపోండి’ అంటూ పోలీసులు హెచ్చరికలు చేస్తుంటే.. మా భూములు సాధించుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు నాదర్గుల్ రైతులు. కొన్నిరోజులుగా సంచలనం సృష్టిస్తున్న ఈ భూముల వ్యవహారంలో పెద్దలకు మద్దతుగా ఖాకీల బెదిరింపులు తోడైనా.. బెదిరేది లేదంటూ దీక్ష కొనసాగిస్తున్నారు. రైతుల ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతుంటే పోలీసుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు రైతులను అడ్డుకోవాలని అధికార పార్టీ ఒత్తిళ్లు ఎక్కువైనట్టు పోలీసులు ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నారు. విభజించి పాలిస్తే అంతా మన సొంతమనుకున్నారో ఏమో.. దీక్ష చేస్తున్న రైతుల మధ్య గొడవ పెట్టేందుకు వారిని రెండు గ్రూపులుగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది.
నాదర్గుల్ రైతుల ఆందోళనలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అంతేస్థాయిలో పోలీసుల నుంచి తమకు హెచ్చరికలు వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. దీక్షా శిబిరాలను ఎత్తివేయాలని చెబుతున్నారు. మంగళవారం శిబిరాలవద్దకు వచ్చిన మహిళా రైతులు తమవారికి మద్దతుగా పాటలు పాడుతూ ‘తమ భూములు తమకే కావాలంటూ’ నినదించారు. ఎందుకు గొడవ చేస్తున్నారని, మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకురావాలని పోలీసులు రైతులకు సూచించారు. దీంతో రైతులు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, భూముల కోసం ఉద్యమిస్తుంటే బెదిరించడమేంటి? అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
రైతుల ఆందోళనలకు వివిధ రాజకీయపార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తున్నది. పెద్దలు జీర్ణించుకోలేక పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నారని, దీంతో దీక్షాశిబిరాలను ఎత్తివేసేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని పలు సంఘాలు పేర్కొన్నాయి. రైతులను నాదర్గుల్ భూముల్లోకి రానివ్వకపోవడంతో పక్కనే ఉన్న మరో వ్యక్తి భూమిలో దీక్షలు చేపట్టారు. సంబంధం లేని కంపెనీలు వచ్చి తమపై దౌర్జన్యం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని రైతులు వాపోతున్నారు.
రైతులను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి దీక్షాశిబిరాలు ఎత్తివేయాలంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం ఈ ఆందోళనలు విరమించి కోర్టులో కొట్లాడాలంటూ రైతులకు సలహా ఇస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ దీక్షలు చేయడం మానకపోతే బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుందని పోలీసులు బెదిరించినట్టు సమాచారం. రైతులు మొండిపట్టు పట్టి తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని చెప్పడంతో పోలీసులు మరో కొత్త ప్రణాళిక సిద్ధం చేసినట్టు చర్చ జరుగుతున్నది. దీక్షలు చేస్తున్న రైతుల్లో కొందరికి లాభాపేక్ష చూపించి రెండు వర్గాలుగా విభజించి దీక్షలను భగ్నం చేయాలని చూస్తున్నట్టు స్థానికంగా చెప్పుకొంటున్నారు.
ఇందులో భాగంగానే నలుగురు రైతులను పిలిచి మీరు ఉద్యమం చేయడమెందుకు? అని అడిగినట్టు తెలిసింది. పోలీసులు మాత్రం వారే వచ్చి తమను అడిగారని, డబ్బులు ఇస్తే దీక్షలు ఆపేస్తామని చెప్పినట్టు ప్రచారం మొదలుపెట్టారు. రైతులంతా పోలీసుల పన్నాగంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ తమకు న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.
తమ భూములు తమకే కావాలంటూ రైతులు 11రోజులుగా నిరసనలతోపాటు వినతిపత్రాలు అందజేస్తున్నారు. బాలాపూర్ మండలం నాదర్గుల్ సర్వే నంబర్ 613 (119)లో ఉన్న 373.22 ఎకరాల ప్రభుత్వ భూమిలో దశాబ్దాల తరబడి రైతులు సాగుచేసుకుంటున్నారు. పేదల కోసం నాడు ఇందిరాగాంధీ ఇచ్చిన భూ ములను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. తమ భూములు తమకు కావాలని దీక్షలు చేస్తుంటే, భూములు మీవికావని పోలీసులు చెప్పడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఏ క్షణమైనా శిబిరాన్ని ఖాళీ చేయించే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.