నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 17 : ప్రజావ్యతిరేకత ఉప్పెనలా ముంచుకొస్తుంటే… అధికార కాంగ్రెస్‌లో అసహనం పెరిగిపోతున్న ది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పల్లెపల్లెన్ల ఎగిసిపడుతున్న గులాల్.. కాంగ్రెస్‌కు కంటగింపుగా మారింది. ప్రజల ఛీత్కారంతో… ఓటమి భయంతో హస్తం పార్టీ నైరాశ్యంలో మునిగిపోయింది. అధికార పార్టీ నేతలు డబ్బు లు పంచుతూ దొరికిపోవడం… అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడటంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దొంగ ఓట్లు ఎందుకు వేశారని ప్రశ్నిస్తే భరించలేని కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ నేతలపై కర్రలతో దాడులకు పాల్పడ్డారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని నిలదీస్తే.. రక్తం కండ్లజూశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన మూడోవిడత పంచాయతీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిశాయి.
వికారాబాద్ జిల్లా మాదారంలో బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్‌పై కాంగ్రెస్ నాయకులు దురుసుగా ప్రవర్తించడం ఉద్రిక్తతకు దారితీసింది. గొడవ పెరిగి, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి రాములుపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిఘటించారు. ఉద్రిక్త పరిస్థితులతో గంటపాటు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థికి గాయాలు కావడంతో పరిగి దవాఖానకు తరలించారు. అనంతరం పోలింగ్ యథాతథంగా జరిగింది. చికిత్స పొందుతున్న రాములును పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పరామర్శించారు. వైద్యుల సూచన మేరకు రాములును హైదరాబాద్ దవాఖానకు తరలించారు.
నల్లగొండ జిల్లా శాంతిగూడెం 3వ వార్డు పోలింగ్స్టేషన్లోకి వృద్ధుడిని ఓ వ్యక్తి వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ వృద్ధుడు ఓటు వేసేందుకు లోపలికి వెళ్త్తుండగా… వెంట వచ్చిన వ్యక్తి… కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గుర్తుకు ఓటు వే యాలంటూ గట్టిగా చెప్పాడు. అలా చెప్పకూడదని బీఆర్ఎస్ ఏజెంట్ మహేశ్ సూచించాడు. సహించలేని కాంగ్రెస్ నాయకులు పోలింగ్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లి మహేశ్‌పై దాడికి పాల్పడ్డారు. తలను కిందికి వంచి కాలితో తొక్కారు. గది తలుపునకు తలను బాదారు. దీంతో మహేశ్ తలకు గాయమైంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండ లం బద్దుతండాలో ఓ ఓటరుపై కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి భూక్యా గంగారావు దాడికి పాల్పడ్డాడు. ఐడీ కార్డు మరచిపోయిన ఓటర్.. బయటకు వచ్చి… మళ్లీ బూత్‌లోకి వెళ్తుండగా రెండోసారి ఓటు వేయడానికి వెళ్తున్నావా అంటూ గం గారావు దౌర్జన్యానికి దిగాడు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీదేడులో మంగళవారం రాత్రి ఓట ్లకోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు కర్రలతో దాడి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఇబ్రహీంపట్నం దవాఖానకు తరలించారు.
సంగారెడ్డి జిల్లా జూకల్తండాలో మంగళవా రం రాత్రి కాంగ్రెస్ నేతలు డబ్బులు పంపిణీ చేస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నా రు. కాంగ్రెస్ నాయకులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రెండు కార్లను ధ్వంసం చేశారు. దాడిలో బీఆర్ఎస్కు చెందిన రవినాయక్, లక్ష్మణ్‌రావు, రాములునాయక్, మారుతినాయక్, మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించగా, రవినాయక్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.
సూర్యాపేట జిల్లా రోళ్లవారిగూడెం ఎన్నిక ఫలితం వెల్లడి తర్వాత గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి బానోత్ విజయ నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. బీఆర్ఎస్ బలపరిచి న బానోత్ సంధ్య ఓడిపోయారు. పోలైన ఓట్ల లో మృతి చెందిన వారి పేర్లు, విదేశాల్లో ఉన్న వారి పేర్లు ఉన్నట్టు బీఆర్ఎస్ నేతలు గుర్తించా రు. 19 ఓట్లు అదనంగా పడటంపై నిలదీశారు. బ్యాలెట్ బాక్స్‌లతో వెళుతున్న వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి, బ్యాలెట్ బాక్స్‌లను నేరేడుచర్లకు తరలించారు.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్ బలపరిచిన గంగుల మంగ గెలిచినట్టు అధికారులు ప్రకటించగా, రీకౌంటింగ్ చేయాలంటూ బీజేపీ బలపరిచిన అభ్యర్థి జక్కుల మమత పట్టుబట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. బీజేపీ నేతలు, కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి, గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. పరిస్థితిని అదులోకి తీసుకొచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో గుంపులుగా ఉన్న ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఓ వ్యక్తి గాయం కావడంతో ఎస్సై పురుషోత్తం, పోలీసులపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దాడిలో పోలీసు వాహనం ధ్వంసమైంది. ఎస్సై, పోలీసులు ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
