సామాన్యులకే కాదు, చట్టాన్ని అమలు చేసే పోలీసులకైనా.. చివరకు చట్టాన్ని చేసే ప్రజాప్రతినిధులకైనా.. ఒకే చట్టం! అయితే, రాజకీయ చదరంగంలో పావులుగా మారిన కొందరు పోలీసు అధికారులు ఈ వాస్తవాన్ని మరిచిపోతున్నారు. రాజకీయ ఎజెండాను తమ భుజాన వేసుకుంటున్నారు. సర్కారు పెద్దల అనధికారిక ఆదేశాలను అమలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏడాదిన్నరగా తెలంగాణలో ఎన్నో కేసులు! మరెన్నో వేధింపులు!! ఏడేండ్లలోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు వద్దంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులు వెలువరించినా.. దానిపై డీజీపీ సర్క్యులర్ ఉన్నా.. కొందరు పోలీసు లు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. సర్కారు పెద్దల ప్రాపకం కోసం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్ని అక్రమంగా ని ర్బంధించి, వేధింపులకు గురిచేస్తున్నారు. పౌరుల ప్రాథమికహక్కుగా ఉన్న భావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ మహిళా జర్నలిస్టులనూ వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పోలీసుల దమనకాండపై బీఆర్ఎస్ లీగల్ సెల్ జంగ్ సైరన్ మోగించింది. దారితప్పిన పోలీసులను కోర్టుకీడుస్తున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ) : తప్పుడు కేసులు బనాయిస్తున్న పోలీసులపై బీఆర్ఎస్ న్యాయపోరాటం మొదలుపెట్టింది. వివిధ సందర్భాల్లో పోలీసులకు న్యాయస్థానాలు మొట్టికాయలు వేసిన తీర్పులను అస్ర్తాలుగా మలుచుకొంటున్నది. బీఆర్ఎస్ శ్రేణులను వేధింపులకు గురిచేస్తున్న పోలీసులపై రివర్స్ కేసులు పెడుతున్నది. ఈ మేరకు విచారణాధికారి నుంచి డీజీపీ వరకు వివిధ హోదాల్లోని పోలీస్ అధికారులకు లీగల్‌సెల్ నోటీసులు ఇస్తున్నది. ఇప్పటికే 30 కేసుల్లో నోటీసులు జారీచేసిన లీగల్ సెల్.. మరిన్ని కేసుల్లోనూ ఈ అస్ర్తాన్ని సిద్ధం చేస్తున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై దాడులు మొదలయ్యాయి.
ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు తప్పుడు సెక్షన్లతో అక్రమ కేసులను బనాయిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం, ప్రజా సమస్యలపై గళం విప్పడం, ప్రభుత్వ, అధికార యంత్రాంగ వేధింపులకు గురవుతున్న బాధితుల పక్షాన నిలబడిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని కేసులతో వేధింపులకు దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో కృత్రిమంగా ఫిర్యాదులను సృష్టించి మరీ కేసులు పెట్టడం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు పలుమార్లు సంబంధిత పోలీసు అధికారులకు మొట్టికాయలు వేసినా వారు తమ తీరును మార్చుకోవడం లేదు. వాస్తవానికి పోలీసులు తాము ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలోనే ఫిర్యాదుదారుడు ఇచ్చే సమాచారం పూర్తిగా నిజమైనదని, అందుకు సంబంధించి ఏయే సెక్షన్లు వర్తిస్తాయనే దానిపై పూర్తి స్పష్టతతో ఉండాలి. ఆ మేరకు న్యాయస్థానాల్లోనూ వాటిని రుజువు చేయాల్సి ఉంటుంది. కానీ, గత ఏడాదిన్నరలో అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు పోలీసుల తీరును తప్పుబట్టడంతోపాటు కేసులను క్వాష్ చేయడం… చివరకు ఉద్దేశపూర్వకంగా పోలీసులు కోర్టు మెట్లు ఎక్కించిన తర్వాత రిమాండ్‌ను తిరస్కరించిన దాఖలాలూ ఉన్నాయి.
తెలంగాణ పోలీసుల్లో కొంతమంది రేవంత్‌రెడ్డి ప్రైవేటు సైన్యంలాగా పని చేస్తున్నరు. ఆ కొంతమందికి కూడా ఇదే హెచ్చరిక.. అలా పనిచేస్తున్న పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ మీద కూడా సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఇష్టానుసారంగా అడ్డమైన కేసులు పెడుతున్న పోలీసు అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాదిన్నరగా అధికార పార్టీ ఒత్తిళ్లతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న కొందరు పోలీసు అధికారులపై బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించింది. అనేక కేసుల్లో తప్పుడు సెక్షన్లు, ఏడేండ్లలోపు శిక్ష పడే కేసుల్లోనూ అరెస్టులు చేయడం తదితర అంశాలన్నింటిపై దృష్టిసారించింది. పోలీసులు చట్టానికి అతీతులుకారని రుజువు చేసేందుకు నడుం బిగించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించేందుకు ‘కొందరు పోలీసు అధికారుల’పైనే రివర్స్ కేసులు నమోదు చేయాలనే న్యాయమైన డిమాండును భుజానికి ఎత్తుకుంది. ఫిర్యాదుదారుతో పోలీసులు కలిసిపోయి ఎదుటివారిపై తప్పుడు కేసులు బనాయిస్తే సెక్షన్లు 198, 199, 248 ఆఫ్ ద బీఎన్ఎస్ 2023 కింద విచారణ జరపడంతోపాటు రూ.రెండు లక్షల వరకు జరిమానా, జైలుశిక్ష కూడా పడే అవకాశముంది. ఇప్పటివరకు దాదాపు 30 కేసుల్లో కొందరు పోలీసు అధికారుల అత్యుత్సాహాన్ని ఎత్తిచూపుతూ ఆయా కేసుల్లో సంబంధిత విచారణ అధికారి నుంచి ఏసీపీ, డీసీపీ, సీపీ, డీజీపీ వరకు నోటీసులు జారీచేసింది. లగచర్ల ఘటనలో అమాయక గిరిజనులపై నమోదైన కేసుల్లోనూ బాధిత గిరిజనుల తరఫున న్యాయపరంగా బాసటనిచ్చింది. పలు కేసుల్లో లీగల్ సెల్ సమర్పించిన డాక్యుమెంట్లు, వాదనలతో కోర్టు సంతృప్తి చెంది కేసులను క్వాష్ చేసిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనలో విద్యార్థులపై పెట్టిన కేసుల విషయంలో లీగల్ సెల్ తన వంతుగా న్యాయసహాయం అందించింది. బీఆర్ఎస్ కార్యకర్తలపై పెట్టిన కేసులు అక్రమమైనవని నిరూపించేందుకు ఆయా కేసుల్లో అవసరమైన న్యాయపరమైన అంశాలతో కూడిన మెటీరియల్ సిద్ధం చేసుకొని న్యాయస్థానాల తలుపు తట్టింది.
భారత రాజ్యాంగం కల్పించిన హక్కును తెలంగాణలో కొందరు పోలీసులు కాలరాస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరో పంపిన పోస్టు నచ్చి రీట్వీట్ చేసినా దానిని నేరంగా పరిగణించి వేధింపులకు గురిచేస్తుండటం ఆందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలకు నచ్చని పోస్టును రీట్వీట్ చేసిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్ని రాజకీయ కక్షతో కేసులు నమోదు చేసి ముప్పుతిప్పలు పెడుతున్నారు. కొణతం దిలీప్, మన్నె క్రిశాంక్, గౌతమ్ తదితరులపై కేవలం ఒక పోస్టును రీట్వీట్ చేసినందుకు ఐటీ చట్టం కింద నమోదు చేసిన కేసులు హాస్యాస్పదంగా ఉన్నాయని బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. సదరు పోస్టుల్లో ఉద్దేశించిన వ్యక్తి, సంస్థ కాకుండా ఎవరో సంబంధం లేని వ్యక్తులు ఫిర్యాదు చేసినా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ శ్రేణుల్ని వేధింపులకు గురిచేస్తున్నట్లు చెప్పారు.
ప్రజాస్వామ్యంలోప్రజలకు అడిగే హక్కు ఉంది. తప్పకుండా అడుగుతరు. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ప్రజలకు మద్దతుగా నిలబడుతున్నరు. ఇదేం అన్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నరు. అలాంటి వాళ్లపై కేసులు పెడుతున్నరు. వాళ్లను పట్టుకుపోతున్నరు. పోలీసు సోదరులను అడుగుతున్న.. మీరెందుకు దుంకులాడుతున్నరు? మీకు ఏం అక్కరొచ్చింది? పోలీస్ మిత్రులారా.. ఈ రోజు రాత్రి మీ ఇండ్లకు వెళ్లి మీ డైరీల్లో రాసి పెట్టుకోండి… మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లు, కార్యకర్తలకు ఒక్కటే చెప్తున్న… ఎక్కడైనా, ఎవరైనా మీపై అన్యాయంగా కేసులు పెడితే మన బీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులున్నరు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అండగా కేసీఆర్ ఉంటడు. బీఆర్ఎస్ ఉంటది.
ఇప్పటికే పలు కేసుల్లో లీగల్ సెల్ న్యాయస్థానాలను ఆశ్రయించిన సందర్భాల్లో సంతృప్తికరమైన తీర్పులు కూడా వచ్చాయి.
సామాజిక మాధ్యమాలకు సంబంధించి పోలీసులు నమోదు చేస్తున్న కేసుల్లో పొందుపరుస్తున్న చట్టాలను పరిశీలిస్తే… సమాచార సాంకేతిక చట్టం, 2000లోని 67, 67ఎ సెక్షన్లు చెబుతున్నది వేరైతే పోలీసులు ఆయా కేసుల్లో దానిని అమలు చేస్తున్నది ఇంకోటి. ఈ సెక్షన్ల కింద ఎలక్ట్రానిక్ రూపంలో అశ్లీల ప్రచురణ గాని, ప్రసారం చేయడం గాని లేదా లైంగికంగా అసభ్యకరమైన విషయాలను సూచించేలా ఉండటం నేరం. ఇదే విషయాన్ని అపూర్వ అరోరా, ఇతరులు వర్సెస్ స్టేట్ (ఢిల్లీ) కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఐటీ సెక్షన్- 67 ప్రకారం అశ్లీల విషయాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడంతోపాటు చట్టం చెబుతున్నట్లు సదరు కంటెంట్‌తో వ్యక్తులు వ్యవస్థను దుర్వినియోగం చేసేలా ఉంటేనే ఈ చట్టం వర్తిస్తుంది.