నందిగామ , జూలై 18: బహదూర్‌గూడ రైతులకు చెందిన సుమారు 650 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యంగా గుంజుకోజూస్తున్నదని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ధ్వజమెత్తారు. బహదూర్‌గూడ రైతుల దీక్షలకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న కార్తీక్‌రెడ్డి, ఇతర రైతులను శనివారం పోలీసులు అరెస్టు చేసి షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకొన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, యువ నాయకుడు మురళీకృష్ణయాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి స్టేషన్ ఎదుట ధర్నాకు దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, శంకర్ డౌన్..డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసులు దొంగల్లాగా పేద, మధ్య తరగతి రైతులపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా, రెవెన్యూ పేర్లతో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. బహదూర్‌గూడ భూముల సమస్య 60,70 ఏండ్లుగా ఉన్నదని, ఇది ప్రభుత్వ భూమి అని ఇప్పుడు మీరెలా చెప్తారని అధికారులను ప్రశ్నించారు. కొత్తూరు మండలంలో సిద్ధాపూర్‌కు డంపింగ్‌యార్డును రానిచ్చేది లేదు.. బహదూర్‌గూడ భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదు.. అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెల్చిచెప్పారు.
స్టేషన్ ఎదుట ఆయన మాట్లాడారు. రైతులు, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిరంతర పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి విమర్శించారు. కార్తీక్‌రెడ్డి, ఇతరులను ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లో ఉంచడంతో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొన్న వారు సహనం కోల్పోయి సీఎం రేవంత్‌రెడ్డిపై తిట్లదండకం అందుకొన్నారు. మహిళలు, రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.