సిద్దిపేట, మే 12: ఇంట్లో డబ్బులు దాచారని ఫిర్యాదు రావడంతో పోలీసులు బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు, దళిత నాయకుడు జువ్వన్న కనకరాజు నివాసాన్ని ఆదివారం సీజ్ చేశారు. సిద్దిపేటలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల అంబేదర్నగర్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కనకరాజు ఇంట్లో డబ్బులు నిల్వ చేశారనే సమాచారంతో పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు. అప్పటికే కనకరాజు తన భార్య అనారోగ్యంతో ఉండటంతో చికిత్స నిమిత్తం ఇంటికి తాళం వేసి ఆమెను హైదరాబాద్ యశోద దవాఖానకు తీసుకెళ్లాడు. ఈ విషయమై పోలీసులు కనకరాజును సంప్రదించగా, తన భార్య అనారోగ్యంతో ఉండటంతో తాను హైదరాబాద్ వచ్చానని, అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పారు. అయినా పోలీసులు ఇంటిని సీజ్ చేసి పోలీస్ పహారా ఏర్పాటు చేశారు.
కనకరాజు తన కుటుంబ సభ్యులతో మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి చేరుకున్నాయి. ఇంటికి వేసిన సీల్ తీయాలని పోలీసులు వేడుకున్నా సాయంత్రం 5.45 వరకు వారిని బయటే వేచి ఉండేలా చేశారు. అతని భార్య అనారోగ్యంతో ఉన్నా పోలీసులు కనికరించలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానికులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. సిద్దిపేట టూ టౌన్ సీఐ ఉపేందర్ సాయంత్రం అకడికి వచ్చి ఇంటికి వేసిన సీల్‌ను తొలగించారు. ఏసీపీ మధుతోపాటు ఎన్నికల అధికారులు, పోలీసులు మీడియా సమీక్షంలో కనకరాజు ఇంటిని పూర్తిగా తనిఖీ చేశారు. ఇంట్లోని దేవుని గదిలో రూ.276 మాత్రమే లభించాయి. అంతకుమించి ఏమి దొరక పోవడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లారు.