ములుగు, జూలై 7 (నమస్తే తెలంగాణ) : ములుగులో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్పై కాంగ్రెస్ సర్కార్ జులుం ప్రదర్శించింది. ఈ నెల 3 నుంచే జిల్లా వ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నది. సోమవారం ములుగులో బీఆర్ఎస్ చేపట్టిన శాంతియుత నిరసనకు అడగడుగునా అడ్డంకులు సృష్టించింది. నిర్బంధాలు, హౌస్ అరెస్టులను కొనసాగించినా బీఆర్ఎస్ శ్రేణులు వెరవకుండా ఉద్యమ స్ఫూర్తిని చాటాయి.
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, అందులో భాగంగానే తనకు ఇల్లు రాలేదని సోషల్ మీడియా వేదికగా నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్తను మంత్రి సీతక్క అనుచరులు బెదిరించారు. అతడిపైకి పోలీసులను ఉసిగొల్పడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు నిరసనగా బీఆర్ఎస్ సోమవారం శాంతియుత నిరసన చేపడతామని ప్రకటించింది. దీంతో కత్తిగట్టిన కాంగ్రెస్ సర్కారు ఈనెల 3 నుంచి 31 దారా ములుగు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ప్రకటించింది.
ఆదివారం సాయంత్రం నుంచే పోలీసులను భారీగా మోహరించి ఉక్కుపాదం మోపాలని చూసింది. ఈ క్రమంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్టులను కొనసాగించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యనేతలెవరూ ములుగుకు చేరుకోకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ములుగువైపు వెళ్లే ప్రతి వాహనాన్ని జల్లెడపట్టారు. మల్లంపల్లి చేరేముందు బస్సు ప్రయాణికులను సైతం వడపోశారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారావును ఏటురునాగారంలో హౌస్ అరెస్టు చేశారు.
తాము నిరసన చేపట్టి తీరుమని ముందు తెగేసిచెప్పిన బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా ములుగు గాంధీచౌక్‌లో ప్రత్యక్షమయ్యారు. మార్కెట్ రోడ్డు నుంచి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి, కుమ్మరిపల్లి నుంచి ములుగు జడ్పీ మాజీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, మాజీ జడ్పీటీసీ సకికాల భవాని సహా నాయకులు ప్లకార్డులు పట్టుకొంని గాంధీచౌక్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ‘కాంగ్రెస్ డౌన్.. డౌన్, సీతక్క డౌన్‌డౌన్, రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ..ములుగు జిల్లాలో సీతక్క ఎమర్జెన్సీ, ప్రజాస్వామ్యమా ? పోలీస్ రాజ్యాంగమా? చుక్క రమేశ్‌ది ప్రభుత్వ హత్యే’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు.
కలెక్టరేట్ గేట్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అటుగా అదనపు కలెక్టర్ మహేందర్‌జీ వస్తుండగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ములుగు జిల్లాలో జరుగుతున్న ఆత్మహత్యలు, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అవకతకలు, ప్రయోగించిన పోలీస్యాక్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్ అటు రానున్నదనే విషయం తెలిసి వారిని అడ్డుకోవాలని చూడగా బారికేడ్లను, డీసీఎం వాహనాలను అడ్డుపెట్టి, రోప్‌పార్టీతో పోలీసులు కట్టడి చేశారు.
ఈ క్రమంలో బడే నాగజ్యోతి, వై సతీశ్‌రెడ్డి సహా మరికొందరు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని లాగేసి వ్యాన్‌లో ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు తోపులాట జరిగింది. ‘పోలీస్ జులుం నశించాలి, ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం..దోపిడీ రాజ్యం’ అంటూ నినాదాలు మిన్నంటాయి. ఒకదశలో జరిగిన తోపులాటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి కిందపడిపోయారు. బడే నాగజ్యోతి, వై. సతీశ్‌రెడ్డి సహా కొంతమందిని వెంకటాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి సహా కొంతమందిని ఆత్మకూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇది జరిగిన కొద్దిసేపటికి పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసులు భావిస్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకొని జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసుల తీరును ఖండించారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని ఆత్మకూర్ పీఎస్‌కు తరలించారు. వరంగల్ నుంచి ములుగుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ నేత రాకేశ్‌రెడ్డి తదితరులను ఆత్మకూరు వద్ద అరెస్ట్ చేశారు.
ముందుగా గాంధీచౌక్ నుంచి ములుగు కలెక్టరేట్ వైపు ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ నేతలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద యూరియా కోసం బారులు తీరిన కొందరు రైతులు పిలిచారు. తమకు యూరియా కొరత తీవ్రంగా ఉన్నదని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి యూరినా కొరతను తీర్చాలని కోరారు. తాము రైతులకు అండగా నిలిచి పోరాడతామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టంచేశారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యం సాగితే ములుగులో మంత్రి సీతక్క ఎమర్జెన్సీ రాజ్యం సాగుతున్నదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తాము చేపట్టిన శాంతియుత నిరసనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. యువకుడి బలవన్మరణ కారకులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి అరాచకానికి మంత్రి సీతక్క కేరాఫ్‌గా మారారని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని భ్రష్టుపట్టిస్తున్నదని ములుగు జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ధ్వజమెత్తారు. తుపాకుల నీడలో రాష్ట్రంలో సాగేది ప్రజాపాలన కాదని, నిర్బం ధ పాలన అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల ఆగడాలతోనే అమాయక యువకుడు బలయ్యాడని విమర్శించారు. తమ నిరసనకు అడ్డు వచ్చిన పోలీసు యాక్ట్ మంత్రుల పర్యటనకు, కాంగ్రెస్ ర్యాలీకి రాదా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ శాంతియుత నిరసనకు పోటీగా తామూ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని కాంగ్రెస్ ప్రకటించింది. ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న తరుణంలో మంత్రి సీతక్క ఆగమేఘాల మీద అగ్నికి ఆజ్యం పోసినట్టు మరో మంత్రి తుమ్మలను జిల్లాకు ఆహ్వానించారు. గట్టమ్మ నుంచి మంత్రి సీతక్క పార్టీ కార్యకర్తలతో చేరుకున్నారు. అప్పటికే కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అదే ప్రాంతంలో మంత్రుల కాన్వాయ్‌ని, ర్యాలీని అక్కడే నిలిపి పటాకులు పేల్చి ‘వాడెవ్వడు వీడెవ్వడు.. సీతక్కకు అడ్డెవ్వడు’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల ముందే కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోయినా ప్రేక్షకపాత్ర వహించారు.
ములుగులో బీఆర్ఎస్ చేపట్టిన మెరుపు నిరసన కాంగ్రెస్ సర్కార్‌కు ముచ్చెమటలు పెట్టించింది. మంత్రి సీతక్కను మెట్టుదించింది. ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబాన్ని ఆమె పరామర్శించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చేలా చేసింది. సాయంత్రం మంత్రి సీతక్క తన షెడ్యూల్లో లేకపోయినా యువకుడి అమ్మమ్మ శెట్టి విశాల ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ వృద్ధురాలికి రూ. 50వేల ఆర్థిక సాయం అందజేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.