హైదరాబాద్/రంగారెడ్డి, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులను అరెస్టు చేసిన పోలీసులు వారిన వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట, తలకొండపల్లి గ్రామాల ప్రజలు మరోసారి నాటి ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించారు. కేశంపేట వద్ద హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులున్న వాహనాలకు అడ్డంగా రోడ్డుపై దాదాపు వెయ్యి మందికి పైగా స్థానిక ప్రజలు బైఠాయించారు. ప్రజల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవ్వడంతో పోలీసులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు హరీశ్‌రావు బృందాన్ని తీసుకెళ్లారు.
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌లు పోలీస్ స్టేషన్‌కు హుటాహుటిన వచ్చారు.అయితే, పోలీస్‌స్టేషన్ వద్దకు వేలాది ప్రజలు చేరుకొని నినాదాలతో హోరెత్తించారు. ఒక దశలో పోలీసులు చేతులెత్తేశారు. ఏం చేయాలో పాలుపోక.. ‘దయచేసి వెళ్లి పోండి సర్’ అంటూ తాము అరెస్టు చేసి తీసుకొచ్చిన బీఆర్ఎస్ నేతలను బతిమాలుకున్నారు. మధుసూదనాచారి, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, డాక్టర్ సంజయ్, వివేక్, శంభీపూర్ రాజు తదితరులను తలకొండపల్లి వైపు తీసుకెళ్లారు.
ఈ విషయం తెలిసిన తలకొండపల్లి ప్రజలు భారీగా తరలి వచ్చి ప్రధాన రహదారిపై ఆయా వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేస్తున్నప్పటికీ వెనక్కితగ్గలేదు. వేరే గత్యంతరం లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలను తలకొండపల్లె పోలీసుస్టేషన్‌కు తరలించారు. తమను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వద్ద అదుపులోకి తీసుకొని సుమారు రెండు గంటలపాటు రోడ్లపై తిప్పారని, మారుమూల గ్రామాల నుంచి అత్యంత వేగంతో వాహనాల్లో తరలించారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి వివరించారు.