హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : వీధి కుక్కలపై విషప్రయోగం చేసి చంపివేయడం అమానుషం, చట్టవిరుద్ధమని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో కుక్కలకు విషమిచ్చి చంపివేసిన ఘటనలపై బుధవారం ఆమె విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. వీధి కుక్కల బెడద ఉన్నదని, మూగజీవాలను చంపడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టంచేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, జనవరి 21 (నమస్తేతెలంగాణ): ఇటీవల భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది.. వీటిపై ఎవరూ ఎందుకు మాట్లాడరు? అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ప్రశ్నించారు. కుక్కలను చంపొద్దని, మూగ జీవాల ప్రేమ గురించి జంతుప్రేమికులు, సామాజికవేత్తలైన రేణూదేశాయ్, అమల లాంటి వారు బాగానే మాట్లాడుతున్నారని, మరి భర్తలను చంపుతున్న ఘటన సంగతేమిటని ప్రశ్నించారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మాట్లాడారు.
ఒకప్పుడు భర్త కోసం సతీసావిత్రి యముడితో పోరాడిందని చెప్పారు. నేడు భర్తలను భార్య, భార్యలను భర్తలు చంపుకోవడం పెరిగిందని తెలిపారు. ఇలా చంపుకొంటూపోతే పిల్లల సంగతేమిటిని ప్రశ్నించారు. ఈ అంశాలపై విద్యావంతులు, మేధావులు ఆలోచించాలని సూచించారు. ఈ తరహా హత్యలను ఆపేందుకు ప్రయత్నం చేయాలని హితవు పలికారు. మహిళా సంఘాలు సమావేశాలు పెట్టి యువతలో చైతన్యం తేవాలని కోరారు. కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రేణూదేశాయ్ చేసిన వ్యాఖ్యలపై వీహెచ్ పైవిధంగా స్పందించారు.