నల్లగొండ: పదేండ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్లగొండ పోక్సో కోర్టు తీర్పు (POCSO Case) వెలువరించింది. దోషి మర్రి ఊషయ్యకు 24 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అదేవిధంగా రూ.40 వేలు జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని పోక్సో కోర్టు ఇన్చార్జ్ జడ్జి రోజా రమణి ఆదేశించారు.
2023, మార్చి 28న నల్లగొండ మండలం అన్నెపర్రికి చెందిన మర్రి ఊషయ్య (60) 4వ తరగతి చదువుతున్న 10 ఏండ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒక్కతే ఉండటాన్ని గమనించిన ఊషయ్య.. ఆమెకు తినుబండారాలు ఇచ్చి లైంగిక దాడిచేశాడు. ఎవరికైనా చెప్పితే చంపుతానని బెదిరించాడు. తనకు జరిగిన దారుణాన్ని గురించి అదేరోజు తల్లికి తెలిపింది. దీంతో ఆమె మరుసటి రోజుల నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెండేండ్ల విచారణ అనంతరం ముద్దాయిని దోషిగా తేల్చిన కోర్టు.. 24 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.