Pocharam | మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి మాజీ శాశనసభ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించారు. రైతులు తమ కష్టాలు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. సాగునీరు లేకపోవడంతో తమ పంటలు ఎండిపోయిన తీరును నేతల దృష్టికి తీసుకెళ్లారు. మూడెకరాల్లో వరి సాగు చేస్తే బోరు మోటారు మూసార్లు కాలిపోయిందని, కాలిపోయిన ప్రతిసారి రూ.5వేల ఖర్చు అవుతోందని స్వామి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టదశకు వచ్చిన పొలం నీళ్లు లేక ఎండిపోయిందని.. పెట్టుబడి మొత్తం పోయిందని మంజీర అనే మహిళా రైతు కష్టాన్ని చెప్పుకున్నారు. కేసీఆర్ హయాంలో ఈ పరిస్థితి లేదని పలువురు రైతులు స్పష్టం చేశారు. ఆందోళన చెందవద్దని, తాము అండగా ఉంటామని నేతలు భరోసానిచ్చారు. రైతులకు పరిహారం ఇప్పించేలా కేసీఆర్ నాయకత్వంలో తామంతా కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి ఎకరాకు రూ.25వేల పరిహారం ఇప్పించేలా కృషి చేస్తామన్నారు.