2014 మేలో పగ్గాలు చేపట్టింది మొదలు సొంత రాష్ట్రం గుజరాత్‌కు నిధుల వరద పారించడాన్ని ప్రధాని మోదీ ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొన్నారు. ఆ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకూ దాదాపు రూ.40 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందులో మోదీ రూ.6 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను గుజరాత్‌కే తరలించారు. తెలంగాణలో 9 సార్లు పర్యటించినా ఒక్క హామీ నెరవేర్చలేదు.
PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఎన్నికలున్నా.. లేకున్నా ప్రధాని మోదీ సొంత రాష్ర్టానికి నిధుల వరదపారుతున్నది. గడిచిన తొమ్మిదేండ్లలో ఆ రాష్ట్రంలో మోదీ పర్యటనలకు హద్దే లేదు. వెళ్లిన ప్రతిసారీ అక్కడ హామీల వర్షమే. వాటి విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లకుపైనే. అదే సమయంలో తెలంగాణలోనూ పలుదఫాలుగా పర్యటించిన ప్రధాని మోదీ ఇక్కడ ఉత్త హామీలు.. పనికిరాని ముచ్చట్లు తప్ప చిల్లిగవ్వ విదిల్చలేదు. తొమ్మిదేండ్లు గడుస్తున్నా విభజన హామీలు నెరవేర్చింది లేదు. తాజాగా, ఆదివారం పాలమూరులో జరిగిన సభలో తెలంగాణలో పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఎన్నికల జిమ్మిక్కులు ప్రారంభించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటితోపాటు విభజన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిందేనని తెలంగాణ ప్రజలు పట్టుబడుతున్నారు.
గుజరాత్‌కు హామీల వర్షమే!
2014 మేలో పగ్గాలు చేపట్టింది మొదలు స్వరాష్ట్రం గుజరాత్‌కు నిధుల వరద పారించడాన్ని ప్రధాని మోదీ ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొన్నారు. ఆ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకూ దాదాపు రూ.40 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందులో మోదీ రూ.6 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను గుజరాత్‌కే తరలించారు. కేంద్రం మంజూరుచేసిన ప్రతీ ఏడు ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టును గుజరాత్‌కే కేటాయించినట్టు అర్థమవుతున్నది. 2014 లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో మౌలిక సదుపాయాల అభివద్ధి కోసం ఇచ్చిన హామీల్లో 40 శాతానికి పైగా ప్రాజెక్టులను కేంద్రం ఒక్క గుజరాత్‌లోనే చేపట్టడం గమనార్హం. అనంతరం 2017 డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.
పోలింగ్‌కు 9 నెలల ముందునుంచే గుజరాత్లో రూ.48 వేల కోట్ల ప్రాజెక్టులకు శరవేగంగా శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను గుజరాత్‌కు అదనంగా కట్టబెట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో గుజరాత్‌కు రూ.82 వేల కోట్ల ప్రాజెక్టులు ధారాదత్తం చేసిన కేంద్రసర్కారు.. నిరుడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రానికి రికార్డుస్థాయిలో రూ.1.3 లక్షల కోట్ల ప్రాజెక్టులను కట్టబెట్టింది. ఒక్క గుజరాత్‌కు మాత్రమే కాదు బీజేపీ అధికారంలో ఉన్న యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానావంటి రాష్ర్టాలకు కూడా ప్రధాని మోదీ పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులను కట్టబెడుతున్నారు.
తెలంగాణకు మొండిచెయ్యి!
తొమ్మిదేండ్లలో తెలంగాణలో పలుసార్లు పర్యటించిన ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన విభజన హామీలను నెరవేర్చలేదు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విభజన హామీల్లో ఉన్నా ఆ ఊసే ఎత్తలేదు. ఈ ఏడాది జూలై వరంగల్‌లో ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలలే సమయం ఉండటంతో కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేసి, విభజన హామీ నెరవేర్చినట్టు మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. మోదీ శంకుస్థాపన చేసింది వ్యాగన్ మరమ్మతు కేంద్రానికని.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఈ మరమ్మతుల కేంద్రానికి చాలా వ్యత్యాసం ఉన్నదని రాష్ట్ర సర్కారు వాదిస్తున్నది. ఇది విభజన హామీ నెరవేర్చినట్టు కాదని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అలాగే, మోదీ పర్యటనలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మాటే ఎత్తడం లేదు.
రామగుండంలో మైనింగ్ విశ్వవిద్యాలయంపైనా నోరు మెదపడం లేదు. తెలంగాణలో ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో ఉన్నా కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు హోదా ఇచ్చేందుకు మోదీకి మనసొప్పడం లేదు. ఇన్నాళ్లూ పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ ఇవ్వాలని రాష్ట్ర సర్కారు పట్టుబడుతున్నా ఉలుకూ పలుకూ లేని మోదీ .. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ రెండింటిపై మరోసారి హామీలు గుప్పించి మళ్లీ రాజకీయానికి తెరలేపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తొమ్మిదేండ్ల కాలంలో గుర్తుకురాని పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందే గుర్తుకొచ్చిందా? అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీటితోపాటు విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని, గుజరాత్, ఇతర రాష్ర్టాల మాదిరిగా తెలంగాణకు కూడా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ ఇవ్వాలనుకొంటే.. మోదీ అలా చేశారు
2015లో పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోదీ వెళ్లారు. రెండు కుండల్లో మట్టి, నీళ్లు తీసుకుపోయి అప్పటి సీఎం చంద్రబాబు చేతిలో పెట్టివచ్చారు. ఇదే విషయాన్ని ఓ సందర్భంలో సీఎం కేసీఆర్ కూడా గుర్తుచేసుకొన్నారు. ‘వాస్తవానికి అమరావతికి మేము వెళ్లకముందు అక్కడ ఏదైనా సాయం ప్రకటించాలని అనుకొన్నాం. కానీ, ప్రధానమంత్రే మట్టి, నీళ్లు ఇచ్చినప్పుడు నేను ఏదైనా ప్రకటిస్తే.. బిడ్డా నాకంటే గొప్పోనివి అయిపోయినవా? అనుకుంటారని ప్రకటించలేదు. ఈ విషయాన్ని యనమలతో, చంద్రబాబుతో కూడా చెప్పా’ అని కేసీఆర్ పేర్కొన్నారు. అలా కేసీఆర్ అమరావతికి ఏదైనా చేయాలని అనుకొన్నప్పటికీ, ప్రధాని పరోక్షంగా అడ్డుకొన్నారు.