దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది
ఇది హైదరాబాద్ వేదికగా ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం.
ప్రజలు తమ దేశభక్తిని నిరూపించుకొనే తరుణం ఆసన్నమైందని ప్రధాని పిలుపునిచ్చారు. 12 ఏండ్ల పాటు అధికార పీఠంపై ఉన్న మోదీ.. యుద్ధాలను, అంతర్జాతీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ.. దేశ ఆర్థిక పరిస్థితి అదుపుతప్పి పోతున్నదని చెప్పకనే చెప్పారు. ఇక ప్రభుత్వం చేయగలిగినది పెద్దగా లేదనే అర్థం వచ్చేలా బాధ్యతను దేశ ప్రజలపైకి నెట్టివేశారు. దుబారా తగ్గించుకోవాలని ప్రజలకు కర్తవ్య బోధ చేశారు. ఫారెక్స్ నిల్వల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నద ని చెప్తూ, విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువుల వాడకాన్ని ఆపేయాలని, విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించే కొనుగోళ్లు, లావాదేవీలు, వ్యవహారాలను నిలిపివేయాలని ప్రధాని కోరారు. దీనికి స్వదేశీ, దేశభక్తి, కర్తవ్యపాలన అనే ముసుగులు తొడిగే ప్రయత్నం చేశారు.
కరోనా నాటి సంక్షోభాన్ని గుర్తు చేసిన ప్రధాని మళ్లీ అప్పటి పద్ధతులను పాటించాల్సిన పరిస్థితులు వచ్చాయని ప్రకటించారు. యుద్ధ సమయాలను మినహాయిస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రధాని ఇలా బహిరంగ సభలో దేశ ఆర్థిక సంకటాన్ని ప్రస్తావించి, పరిష్కార బాధ్యతను ప్రజలపైకి తోయడం బహుశా ఇదే మొట్టమొదటిసారి. సంకీర్ణ శకంలో, 1989లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటి, 47 టన్నుల బంగారాన్ని కుదువ పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా అప్పటి ప్రధాని చంద్రశేఖర్ మోదీలాంటి పిలుపును ఇవ్వలేదు. అప్పుడెప్పుడో 1965లో చైనాతో యుద్ధంలో ఓటమి తర్వాత, తీవ్ర కరువు, ఆహార పదార్థాల కొరత నెలకొన్న సమయంలో, అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి ‘వారానికి ఒక్కపూట భోజనం మానేయాలని’ ప్రజలకు సూచించారు. సరిగ్గా ఇలాంటిదే కాకున్నా మోదీ ఇంతకు మించిన మార్గదర్శకాలనే దేశం ముందు ఉంచారు.
మోదీ ప్రకటన పర్యవసానాలేమిటి? నిజంగానే విదేశీ వస్తువులను ఆపేస్తారా? లేక ఆ ముసుగులో మోదీయే దిగుమతులను తగ్గిస్తారా? అదే జరిగితే ధరలు పెరుగవా? ఉన్న సరుకును బ్లాక్ మార్కెట్ చేస్తే అడ్డుకునేవారెవరు? వినియోగ వస్తువుల వాడకం తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థలో కలిగే ఇతర విపరిణామాలు, ఉద్యోగ, ఉపాధి నష్టాల సంగతేమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు ఇంకా దొరుకాల్సి ఉన్నది.
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): వికసిత్ భారత్ అంటూ దేశాభివృద్ధిపై నిన్నమొన్నటి దాకా ఊదరగొట్టిన ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు ఉన్నపళంగా చేతులెత్తేశారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, పెను సంకటంలో కూరుకుపోతున్నదని సంకేతాలిచ్చారు. ఇక తన చేతుల్లో ఏమీ లేదని, ఇకపై భారమంతా దేశ ప్రజలపైనే ఉన్నదని తేల్చేశారు. అందుకే ఇప్పుడు దేశభక్తిని కొత్త రూపంలోకి మార్చుతున్నారు. విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించడమే నిజమైన దేశభక్తి అంటూ హితోపదేశం చేశారు. దేశ భవిష్యత్తు ముసుగులో ప్రజల స్వతంత్రతపై పరోక్ష ఆంక్షలు విధిస్తున్నారు. ఈ అత్యంత దురదృష్ట ఘటనకు పరేడ్‌గ్రౌండ్ వేదికైంది. ఆదివారం తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దేశం ఊహించని, దేశ ప్రజలకు షాక్ ఇచ్చే ప్రసంగం చేశారు. సభలో ఆయన మాటలు వింటే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై ప్రధాని మోదీ చేతులెత్తేసినట్టే కనిపించింది. సమస్యలను పరిష్కరించలేక ప్రజలపైనే భారం మోపే ప్రయత్నం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల కొరత ఏర్పడుతుందని తెలిపారు. ఈ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలంతా సంయమనం పాటించి సహకరించాలని కోరారు. దేశం దిగుమతులపై ఆధారపడుతుండటంతో విదేశీ మారకద్రవ్యం అడుగంటుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో సంక్షోభం తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. ఆందుకే విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకొనేందుకు, పెంచుకునేందుకు దిగుమతులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రజలు విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ఇందులో భాగంగానే ప్రజలకు తొమ్మిది పొదుపు సూత్రాలను తెలిపారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని, రైతులు యూరియా వినియోగం తగ్గించాలని, సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలని, ప్రజలు సొంత వాహనాలను కాకుండా మెట్రో, బస్సుల వంటి ప్రజా రవాణాను వినియోగించాలని సూచించారు.
ఇక ఏడాది పాటు బంగారం కొనుగోలును పూర్తిగా బంద్ చేయాలని, శుభకార్యాలకు కూడా బంగారం కొనుగోలును తగ్గించాలని సూచించారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని, నిత్యావసర సరుకుల జాబితాలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులను తొలగించాలని పిలుపునిచ్చారు. విదేశీ పర్యటనలు, విదేశాల్లో పెండ్లిళ్లను తగ్గించుకోవాలని చెప్పారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగం పూర్తిగా తగ్గించాలని, లేదంటే దేశంలో ఆర్థిక సంక్షోభం తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.
1.పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలి
2.అవసరమైతే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలి
3.బంగారం కొనుగోళ్లను ఏడాదిపాటు ప్రజలు నిలిపివేయాలి
4.విదేశీ టూర్లు, డెస్టినేషన్ వెడ్డింగ్‌ల మోజు వదిలి పెట్టాలి
5.సొంత వాహనాలు వదిలి, మెట్రో, బస్సుల్లో ప్రయాణించాలి
6.వంట నూనెల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి
7.యూరియా, ఇతర ఎరువుల వాడకాన్ని కుదించుకోవాలి
8.వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్‌లకు ప్రాధాన్యమివ్వాలి
9.ఇంట్లో అవసరమయ్యే నెలవారీ సరుకుల లిస్టును చూసి, విదేశాల నుంచి దిగుమతయ్యే వాటిని తొలగించుకోవాలి.
దేశభక్తికి ప్రధాని మోదీ కొత్త రూపం ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తేనే దేశ భక్తి కాదని, దేశ వికాసం కోసం పాటుపడటం కూడా దేశభక్తేనని చెప్పారు. తద్వారా రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు దేశభక్తిని చూపించాలని పిలుపునిచ్చారు. సంక్షోభాన్ని ప్రజలపై రుద్ది, దాన్ని ఎదుర్కొనే భారాన్ని సైతం ప్రజలపైనే వేశారు. దీనికి దేశభక్తి అనే ముసుగు తగిలించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ వస్తువులను వినియోగించబోమంటూ ప్రతి పౌరుడూ సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్వదేశీ అనేది కేవలం బీజేపీ నినాదం కాదని, ఇది దేశ విధానమని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. తద్వారా రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కొనేలా దేశభక్తి ముసుగులో ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీని ఎంఎంసీ పార్టీగా అభివర్ణించారు. అంటే ముస్లిం మావోవాది కాంగ్రెస్ (ఎంఎంసీ) పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా తొలుత మొదలయ్యేది అవినీతేనని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం మొదట హామీలు గుప్పించే ఆ పార్టీ, తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పుతుందని, హామీల అమలుకు సాకులు వెతుకుతుందని విమర్శించారు. తెలంగాణలోనూ ఇదే జరుగుతున్నదని చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చివరికి ఇంట్లో, వంటింట్లో వినియోగించే నిత్యావసరాల లిస్టులోనూ కోత పెట్టుకోవాలని సూచించారు. నిత్యావసరాల జాబితాలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులుంటే వాటి వినియోగం తగ్గించాలని, వాటిని జాబితా నుంచి తొలగించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఒకవేళ మోదీ చెప్పినట్టే విదేశీ వస్తువుల వినియోగాన్ని బంద్ చేస్తే ఇక ఇంట్లో సరుకుల వాడకం పూర్తిగా బంద్ చేయడమే ఏకైక మార్గమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఇంట్లో వినియోగించే వస్తువులు, నిత్యావసర సరుకుల్లో మెజారిటీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ఈ నేపథ్యంలో విదేశీ వస్తువుల వినియోగం బంద్ చేస్తే ఇంట్లో ఉండేది కేవలం బియ్యం, ఉప్పు, మిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి మాత్రమే. చివరికి మిరియాలను కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.
ఒకప్పుడు రాగి(కాఫర్)ని విదేశాలకు ఎగుమతి చేసిన మన దేశం.. ఇప్పుడు దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ అవసరాలకు విదేశాల నుంచి రాగిని దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? దీనికి ఎవరు కారణమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశంలో ఉన్న సంపదను అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టి విచ్చలవిడిగా మైనింగ్‌కు అవకాశం కల్పించి ఇప్పుడు బీద ఏడుపులు ఏడిస్తే లాభమేంటనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వనరులన్నీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఇప్పుడు ప్రజలను పొదుపు చేయాలని పిలుపునివ్వడం ప్రభుత్వాలకు ఏ మేరకు న్యాయమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు యుద్ధాలు జరిగితే ప్రజలు బంగారాన్ని దానం ఇచ్చేవారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బంగారమే కొనుగోలు చేయొద్దని పిలుపునిచ్చే దుస్థితికి ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
1. ఏడాది పాటు బంగారం కొనుగోలు బంద్ చేయాలి. శుభకార్యాలకు బంగారం కొనుగోలును తగ్గించుకోవాలి. బంగారం దిగుమతులు తగ్గిస్తే విదేశీమారక ద్రవ్యం పెరుగుతుంది. పేద, మధ్య తరగతి ప్రజలు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆడంబరాలకు పోకూడదు.
2. విదేశాల్లో డెస్టినేషన్ మ్యారేజీలను పూర్తిగా తగ్గించుకోవాలి.
3. ప్రజలు విదేశీ పర్యటనలను సైతం తగ్గించుకోవాలి.
4. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలి. వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి.
5. పంటలకు రసాయన ఎరువుల (యూరియా వంటివి) వినియోగం భారీగా తగ్గించాలి. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలి.
6. ఇంట్లో ఉపయోగించే సరుకుల లిస్టును పరిశీలించుకోవాలి. నిత్యావసరాల వస్తువుల్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులను లిస్టు నుంచి తీసేయాలి. వాటి వినియోగం తగ్గించాలి. విదేశీ వస్తువులను వినియోగించబోమని ప్రతి పౌరుడు ప్రతిజ్ఞ చేయాలి.
7. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఎ క్కువగా కొనుగోలు చేసి వినియోగించుకోవాలి. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించడం వల్ల దిగుమతులు తగ్గి భారీగా విదేశీ మారకద్రవ్యం మిగులుతుంది.
8. ప్రజలు ప్రయాణం కోసం సొంత వాహనాలకు బదులుగా ప్రజా రవాణా వ్యవస్థలైన మెట్రో, బస్సు సేవలను ఉపయోగించుకోవాలి.
9. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి.
విదేశీ మారకం ఎక్కువగా ఖర్చ య్యే మరో అంశం బంగారం. ఒక జమానాలో సంకటస్థితి ఏర్పడినప్పు డు, యుద్ధం వచ్చినప్పుడు ప్రజలు దేశం కోసం బంగారాన్ని దానమిచ్చేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. కానీ దేశహితం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏడాది వరకు ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, ఏ కార్యక్రమం జరిగినా.. బంగారా న్ని, నగలను కొనవద్దు. దేశభక్తి మనకు సవాల్ విసురుతున్నది. ప్రజలందరూ ఆ చాలెంజ్‌ను స్వీకరించాలి.
– ప్రధాని మోదీ