Rythu Bharosa | హైదరాబాద్, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ): దాదాపు 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చే అవకాశం లేదని తెలుస్తున్నది. ఇప్పటికే రైతుభరోసాపై అసెంబ్లీలో చర్చ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ పథకం నిబంధనలను వర్తింపజేస్తామంటూ పరోక్ష సంకేతాలు ఇచ్చిందని రాజకీయ, వ్యవసాయరంగ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసాకు పీఎం కిసాన్ నిబంధనలను అమలు చేస్తే అర్హులైన రైతుల సంఖ్యలో భారీగా కోత పడే ప్రమాదం ఉన్నది. గతంలో బీఆర్ఎస్ సర్కారు ప్రతి సీజన్లో సుమారు 70 లక్షల మందికి రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించింది. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకం కింద 30 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందుతున్నది.
రైతుబంధు అర్హులతో పోల్చితే, పీఎం కిసాన్ అర్హులు 40 లక్షల మంది తక్కువ. కాంగ్రెస్ సర్కారు పీఎం కిసాన్ నిబంధనలను అమలు చేస్తే ఈ 40 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయంలో కోతపడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం శాసనసభలో రైతుభరోసాపై ప్రభుత్వం చర్చ చేపట్టింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుబంధు పంపిణీకి సంబంధించిన గత వివరాలతోపాటు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిబందనలను సభ ముందు ఉంచుతున్నట్టు ప్రకటించారు. పీఎం కిసాన్ నిబంధనలను అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఇది దేనికి సంకేతం? తెలంగాణ ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ మాదిరిగానే రైతుభరోసాలో కోతలు పెట్టేందుకు సిద్ధమైందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందిస్తూ.. రైతుభరోసాలో పీఎం కిసాన్ నిబంధనల ఆధారంగా కోతలు పెడతారా? అని ప్రశ్నించగా.. ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఒకవేళ ప్రభుత్వానికి కోతల ఆలోచన లేకపోతే పీఎం కిసాన్ నిబంధనల జోలికి ఎందుకు వెళ్లిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికే రుణమాఫీలోనూ పీఎం కిసాన్ నిబంధనలను అమలుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కేవలం 25 లక్షల రుణ ఖాతాలకు రుణమాఫీ చేసింది.
వీరికి రైతుభరోసా గోవిందా?
ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా అర్హుల గుర్తింపునకు పీఎం కిసాన్ నిబంధనలను అమలు చేస్తే వివిధ వర్గాలకు చెందినవారికి భారీ సంఖ్యలో కోతపడటం ఖాయం. పీఎం కిసాన్ నిబంధనల్లో అతి ముఖ్యమైంది.. కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే, ఒక్కరికి మాత్రమే పెట్టుబడి సాయం అందుతుంది. ఈ లెక్కన మిగిలిన వారికి రైతుభరోసా గోవిందా! కుటుంబంలో ఏ ఒక్కరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులు, లాయర్లు, ఇంజినీర్లు, డాక్టర్లు, ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉన్నా ఆ కుటుంబం మొత్తానికి పీఎం కిసాన్ రాదు. దీంతో రైతుభరోసాలోనూ వీరందరికీ పెట్టుబడి సాయం ఎగనామం ఖాయంగా కనిపిస్తున్నది.
రైతుకిచ్చే సాయం.. ప్రభుత్వానికి భారమా ?
ఆర్థికభారం నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాలో కోతలకు సిద్ధమవుతుందనే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్త్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం ఏటా రూ.24 వేల కోట్ల నిధులు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత భారం మోసే పరిస్థితిలో లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కోతలు పెట్టి అర్హుల సంఖ్యను తగ్గిస్తే ఆర్థిక భారం అదే తగ్గిపోతుందనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఈ విధంగా రైతు భరోసా వ్యయాన్ని రూ.10 వేల కోట్లకు పరిమితం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అయితే ప్రభుత్వ ఆలోచనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతులకు సాయం చేయడం ప్రభుత్వానికి భారమైందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైతులకు కోతలు పెట్టాలనే ఆలోచన కన్నా మరో దౌర్భాగ్యం లేదని వ్యవసాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
శాసనసభలో మంత్రి తుమ్మల పెట్టిన పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం వీరు అనర్హులు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) కింది వర్గాలకు చెందిన వారు కుటుంబంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది ఉంటే ఆ రైతు కుటుంబాలు ఈ పథకానికి అనర్హులు. ఎందుకంటే కుటుంబ యూనిట్‌గా లబ్ధిదారులను గుర్తిస్తారు.
ప్రజా ప్రతినిధులు
సాయంరాని వాళ్లు వీళ్లే
ఈ కుటుంబాలకూ రాదు..
ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు,అర్కిటెక్ట్స్ , ఇతర ప్రొఫెషనల్స్