హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): హరితహారం కార్యక్రమం పేరు మార్చి దానికి వన మహోత్సవం అని పేరు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దానిని అటకెక్కించింది. పర్యావరణం, నదులు, ప్రకృతికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని గొప్పలు చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. వన మహోత్సవంలో ఈ ఏడాది 20.02 కోట్ల మొక్కలు నాటుతామని ప్రకటించి ఆ తర్వాత లక్ష్యాన్ని 13 కోట్లకు కుదించింది. ఈ ఏడాది ఆశించిన దానికంటే అధిక వర్షాలు కురిసి మొక్కలు నాటేందుకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. బీఆర్ఎస్ పాలనలో 9 విడతలు నిర్వహించిన హరితహారంలో దాదాపు 283 కోట్ల మొక్కలు నాటారు. పచ్చదనం-పరిశుభ్రతలో తెలంగాణ దేశానికి రోల్ మాడల్‌గా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 9న హరితహారం పేరును ‘వన మహోత్సవం’గా మార్చింది. మొదటి విడత జూలై 8న వన మహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించింది. అప్పటి నుంచి ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మొక్కలు కూడా నాటలేకపోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ప్రతి ఏటా ప్రత్యేకంగా నిధులు కేటాయించేది. నర్సరీలలో మొక్కలు పెంచడానికి, గుంతలు తవ్వడానికి, మొక్కలను గ్రామాల్లోకి సరఫరా చేయడానికి అవసరమయ్యే నిధులను కార్యక్రమానికి ముందు రోజే విడుదల చేసేది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసేవారు. కానీ ఈ ఏడాది వన మహోత్సవానికి అలాంటి ముందస్తు ప్రణాళిక, ఏర్పాట్లు లేకపోవడం, నిధులు కేటాయించకపోవడంతో క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా మొక్కలు నాటేందుకు ఆసక్తి చూపలేదు. కార్యక్రమ అమలు కోసం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి అటవీశాఖ ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.
ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేయకపోవడం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల వన మహోత్సవం విఫలమైనట్టు అటవీశాఖ అధికారులు అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అటవీశాఖతో నిత్యం కార్యక్రమ అమలుపై పర్యవేక్షణ ఉండేదని, ఈ ఏడాది అలాంటి పర్యవేక్షణ లోపించడంతోనే వన మహోత్సవం ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదని అటవీశాఖ భావిస్తున్నది. దీనికితోడు క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపలేదని తెలిసింది.