హైదరాబాద్, అక్టోబర్ 24: (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ తీరుతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు కలగానే మిగలనున్నది. గోదావరి జలాల సంగతేమో కానీ కృష్ణా జలాల్లో వాటాకూ గండిపడనున్నది. రేవంత్ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో రెంటికి చెడ్డ రేవడిలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిస్థితి మారనున్నది. మహారాష్ట్ర సమ్మతిస్తే తప్ప నీరందని పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణకు నదీజలాలు దక్కకూడదని కుట్రపూరితంగా నాడు ఉమ్మడి పాలకులు రూపొందించిన ప్రణాళికలనే నేడు మళ్లీ కాంగ్రెస్ సర్కార్ ముందుకు తీసుకుపోతుండటమే అందుకు కారణంగా నిలుస్తున్నది. గోదావరి నుంచి చేవెళ్ల వరకూ నీరందాలంటే 551.18 కి.మీ దూరం జలాలను తరలిస్తే తప్ప ఇక్కడి ఆయకట్టుకు నీరందని పరిస్థితి. ఆ మేరకు తమ్మిడిహట్టి వద్ద ప్రాణహితపై బరాజ్ నుంచి 90 రోజుల్లో 160 టీఎంసీల జలాలను తరలించాలి. 16.24 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలి.
అందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాలకు దాదాపు 2.34 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. కానీ తమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు 116 కి.మీ, అక్కడి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయం 36.63 కి.మీ, అక్కడి నుంచి మల్లన్నసాగర్ 70.60 కి.మీ, అక్కడి నుంచి హల్దీవాగు, దౌల్తాబాద్ మండలం, చేర్యాల మీదుగా చేవెళ్ల చెరువుకు 327.95 కి.మీ కాలువ ద్వారా జలాలను తరలించాలి. మొత్తంగా 551.18 కి.మీ మేర జలాలను కాలువలు, సొరంగాలు, లిఫ్టుల ద్వారా దాదాపు 600 మీటర్లకు పైగా ఎత్తిపోయాలి. ఇక్కడ ఒక్కటే రంగారెడ్డి జిల్లాలోని ఆయకట్టుకు నీరందించాలంటేనే 25 టీఎంసీలు కావాలి. కానీ మల్లన్నసాగర్ నుంచి చేవెళ్ల చెరువు వరకు ఉన్న నీటి నిల్వ సామర్థ్యం అత్యల్పం. మల్లన్నసాగర్ నీటినిల్వ సామర్థ్యమే 1.5 టీఎంసీలుగా నాటి కాంగ్రెస్ ప్రతిపాదించింది. మొత్తంగా 2 టీఎంసీలకు మించి ఎక్కడా నిల్వ సామర్థ్యం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలి. నిరంతరాయంగా 551.18 కి.మీ నెట్‌వర్క్‌లో జలాలు పారితే తప్ప చేవెళ్ల ఆయకట్టుకు నీరందదు. నీళ్లు ఇవ్వాలంటే పంపులు ఆన్ చేయాల్సిందే.
కృష్ణా దక్కకుండా.. గోదావరి పారకుండా!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కృష్ణా బేసిన్ పరిధిలో ఉంటుంది. జూరాల ప్రాజెక్టు నుంచి చేవెళ్ల చెరువు దాదాపు 120 కి.మీ. దూరమే ఉంటుంది. ఎత్తు కూడా 320 మీటర్లకు మించి ఉండదు. జూరాల నుంచి కూడా నీటిని ఎత్తి తక్కువ ఖర్చుతో చేవెళ్లకు తరలించే అవకాశమూ ఉన్నది. గతంలో తెలంగాణ మేధావులు, పలువురు ఇంజినీర్లు కూడా జూరాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను తెరమీదకు తెచ్చారు. దాదాపు 9,000 కోట్ల ఖర్చుతో, 4 స్టేజీల్లో జూరాల నుంచి చేవెళ్లకు కృష్ణా జలాలను తరలించవచ్చని ప్రతిపాదించారు. కానీ, ఆనాటి ఉమ్మడి కాంగ్రెస్ పాలకులు దానిని పక్కన పడేశారు. తెలంగాణకు కృష్ణా జలాలను దక్కనీయకూడదనే కుట్రకు తెరలేపారు. గోదావరి నుంచి జలాలను చేవెళ్లకు తరలిస్తామంటూ నమ్మబలికారు. కానీ, ప్రాజెక్టు పూర్తయినా గోదావరి జలాలు కూడా తెలంగాణ గడ్డపై పారొద్దనే కుట్రపూరిత ప్రణాళికలను రచించారు. అందులో భాగంగానే ప్రాజెక్టులో ఎక్కడా స్టోరేజీలు పెట్టకుండా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూపొందించారు. ప్రాజెక్టు మొత్తంగా 16 టీఎంసీల నిల్వ సామర్థ్యన్నే ప్రతిపాదించారు. తమ్మిడిహట్టి బరాజ్ వద్ద 5 టీఎంసీలను మినహాయిస్తే ప్రాజెక్టు మొత్తంలో నీటినిల్వ సామర్థ్యం 11 టీఎంసీలే. ఆ వ్యవస్థతోనే 16.24 లక్షల ఎకరాలకు సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు, గ్రామాలకు తాగునీరు అందిస్తామని కాంగ్రెస్ పాలకులు నమ్మబలికారు. అది అసాధ్యమని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
మహారాష్ట్ర అంగీకరిస్తేనే నీళ్లు
తమ్మిడిహట్టి వద్ద 152 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్ నిర్మించాల్సి ఉన్నది. ఆ లెవల్లో బరాజ్ నిర్మిస్తే పొరుగున మహారాష్ట్రలో భారీగా ముంపు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో 152 ఎఫ్ఆర్ఎల్కు మహారాష్ట్ర సర్కార్ ఆది నుంచీ అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వచ్చింది. ఆ లెవల్లో బరాజ్ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కరాకండిగా తేల్చిచెప్పింది. అయినా ఆ రాష్ట్రంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండానే నాటి కాంగ్రెస్ పాలకులు పనులను ప్రారంభించారు. బరాజ్ ఎఫ్ఆర్ఎల్ 152గా, హెడ్ రెగ్యులేటర్ సిల్ లెవల్ 145.25 మీటర్లుగా ఖరారుచేసి కాలువలను తవ్వారు. బరాజ్‌ను మాత్రం నిర్మించలేదు. స్వరాష్ట్ర ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రభుత్వం సైతం మహారాష్ట్రను ఒప్పించేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినా మహారాష్ట్ర మాత్రం పట్టువీడలేదు. తుదకు 148 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్ నిర్మాణానికి అంగీకరించింది. అయితే ఆ స్థాయిలో బరాజ్‌ను నిర్మిస్తే కేవలం 2.75 మీటర్ల హెడ్ మాత్రమే ఉంటుంది. దీంతో బరాజ్ నుంచి 44 టీఎంసీలకు మించి మళ్లించలేని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్ చేసింది. ప్రాజెక్టును రెండు భాగాలు చేసింది. ఆదిలాబాద్ జిల్లా ఆయకట్టు కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టును, మిగతా ఆయకట్టు కోసం కాళేశ్వరం చేపట్టింది.
కాంగ్రెస్ సర్కార్ హడావుడి
ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ తమ్మిడిహట్టి అంటూ హడావుడి చేస్తున్నది. చేవెళ్లకు సైతం గోదావరి జలాలనే తరలిస్తామని ప్రణాళికలను రూపొందిస్తున్నది. మహారాష్ట్రను ఒప్పిస్తామంటూ నమ్మబలుకుతున్నది. 152 ఎఫ్ఆర్ఎల్కు మహారాష్ట్ర ఒప్పుకుంటే ఈ పరిస్థితే ఉండేది కాదు. అన్నీ తెలిసి ఇ ప్పుడు కాంగ్రెస్ మళ్లీ అదే రాగం పాడుతున్నది. 150 ఎఫ్ఆర్ఎల్కైనా ఒప్పిస్తామంటూ చెప్తున్నది. కానీ ఆ లెవల్‌తో బరాజ్‌ను నిర్మిస్తే గరిష్ఠంగా 88 టీఎంసీలకు మించి మళ్లించుకోలేని పరిస్థితి. నాడు అనేక అభ్యంతరాల మధ్య 148 ఎఫ్ఆర్ఎల్కు నాటి సీఎం ఫడ్నవీస్ అంగీకరించారు. ప్రస్తుతం కూడా అక్కడ ఆయనే సీఎంగా ఉన్నారు. మరి 150 ఎఫ్ఆర్ఎల్కు ఇప్పుడు ఎలా అంగీకరిస్తారు? అనేది ప్రశ్న. మొత్తంగా కాంగ్రెస్ తీరుతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అటు గోదావరి నీరు దక్కకుండా పోవడమేకాదు.. ఇటు కృష్ణాలోనూ వాటా జలాలకు గండిపడే ప్రమాదం ఏర్పడింది.
కేసీఆర్ హయాంలో రీ డిజైన్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రాజెక్టు మొత్తాన్ని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రీ డిజైన్ చేశారు. సీడబ్ల్యూసీ సూచనల మేరకు నీటి నిల్వ సామర్థ్యాన్ని 141 టీఎంసీలకు పెంచి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఏలికలు చేసిన తప్పులను సరిద్దారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను కాకుండా కృష్ణా జలాలను అందించేందుకు పూనుకున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా జలాలను అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 16.03 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ ఎడమ ప్రధాన కాలువ మొత్తం 120 కి.మీ కాగా, దాని ద్వారా వికారాబాద్ జిల్లాలో దాదాపు 2.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి 100 కి.మీ పొడవుతో ఏర్పాటు చేయనున్న 2వ కుడి కాలువ ద్వారా మొత్తంగా రంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రణాళికలను సిద్ధంచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రణాళికలన్నింటినీ పక్కనబెట్టి, ప్రాజెక్టు పనులను చేపట్టకుండా తెలంగాణకు తీరని ద్రోహం తలపెడుతున్నది. తెలంగాణకు నీళ్లు దక్కకుండా ఉండేందుకు కుట్రపూరితంగా నాడు ఉమ్మడి పాలకులు రూపొందించిన ప్రణాళికలనే రేవంత్‌రెడ్డి సర్కార్ ఇప్పుడు అమలు చేసేందుకు హడావుడి చేస్తున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు తీరని ద్రోహానికి పూనుకున్నది.