రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): ‘పాలమూరుకు వచ్చిన ప్రధాని మోదీ కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటిస్తారని తెలంగాణ ఉద్యమకారుడిగా ఎంతో ఆశపడ్డాను. కానీ ప్రధాని నిరాశ పరిచారు’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ విమర్శించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తలేమని మోదీ పార్లమెంటులో చెప్పారని, కానీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు బుందేల్‌ఖండ్ ప్రాజెక్టుకు రూ.45 వేల కోట్లు మంజూరు చేసి, ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని, కర్ణాటకలో ఎన్నికలొస్తే అక్కడి ప్రాజెక్టుకు సైతం జాతీయ హోదా ప్రకటించారని, తెలంగాణకు మాత్రం అన్యాయం చేశారని విమర్శించారు. పసుపుబోర్డు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కేవలం బీజేపీ ఎన్నికల స్టంట్ అని ఎద్దేవా చేశారు.