Telangana Assembly | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా సభా నాయకుడే సహచర ఎమ్మెల్యేను లేపి నిలబెట్టి కండలు చూడమంటూ కవ్వించడంతో.. అధికార పక్షం సభ్యులు రెచ్చిపోయారు. కత్తులు లేస్తాయంటూ బెదిరింపులకు దిగారు. బొక్కలో వేసి తొక్కుతామంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘రారా చూసుకుందాం..’ అంటూ చుట్టుముట్టారు. కుంభకోణాలను బయటపెట్టి, నిగ్గు తేల్చాలని సభలో పట్టుబట్టిన ప్రతిపక్ష సభ్యుల పట్ల అధికార పార్టీ సభ్యులు ప్రవర్తించిన తీరు.. అసెంబ్లీ గ్యాలరీలో కూర్చొని గమనిస్తున్న మీడియా ప్రతినిధులకు కనిపిస్తున్నదీ, వినిపిస్తున్నది. కానీ, బాధ్యులే ఏమీ గమనించనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది. నిండు సభలో జరిగిన అంశానికి దళిత రంగు పులిమి రాజకీయం చేశారు. చివరికి ప్రతిపక్ష ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మీద యాక్షన్ తీసుకొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అదివారం సభ ప్రారంభం కాగానే పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహరం టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, బీఆర్ఎస్ శాసనసభ్యులు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలను వదిలిపెట్టలేదు. హౌస్ కమిటీ వేయాలని లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే డిమాండ్‌తో ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మంత్రి పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కల్పించుకుంటూ.. తాతలు దిగివచ్చినా పొంగులేటిని బర్తరఫ్ చేసే ప్రసక్తి లేదని ఎదురుదాడికి దిగారు. క్రమంగా ప్రతిపక్షాలది పైచెయ్యి అవుతున్నదని నిర్ధారించుకున్న అధికార పార్టీ డైవర్షన్ పాలిటిక్స్‌ను తెరమీదికి తెచ్చింది. వ్యూహాత్మకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మైకు ఇచ్చింది. కడియం శ్రీహరి మైకు అందుకోవడంతోనే ‘దొంగతనం చేసినవాళ్లు ఏ రకంగా భయపడుతున్నారో చూడండి అధ్యక్షా..! సిగ్గులేకుండా ఏరకంగా అరుస్తున్నారో చూడండి అధ్యక్షా..’ అంటూ ప్రతిపక్ష సభ్యులపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ సందర్భంలోనే ‘మీది ఏపార్టీ’ అంటూ ప్రతిపక్ష సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేశారు. దీంతో సహనం కోల్పోయిన కడియం శ్రీహరి నోటికి పని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తదితరులపై విమర్శలకు దిగారు.
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే గుండాగిరి
కత్తుల కోలాటం ఆడతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రెచ్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ pic.twitter.com/XJMq3bfikY
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2026
కడియం మాటల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘మీది ఏ పార్టీ కడియం గారూ?’ అంటూ ఆయన్ని ప్రశ్నించేందుకు ప్రయత్నించడం అసెంబ్లీ గ్యాలరీ నుంచి చూస్తున్న జర్నలిస్టులకు వినిపించింది. ఆదే సందర్భంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మద్దతుగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితోపాటు మరి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరుష పదజాలం, రన్నింగ్ కామెంట్రీతో దూసుకొచ్చారు. నాగరాజు అయితే ఏకంగా ‘రారా చూసుకుందాం..’ అంటూ కౌశిక్‌రెడ్డిని ఉద్దేశించి రన్నింగ్ కామెంట్రీ చేయడం స్పష్టంగా వినిపించింది. కడియం వ్యవహారానికి పక్కా ప్రణాళిక ప్రకారం దళిత రంగు పులిమారు. అనంతరం స్పీకర్ కడియం శ్రీహరి అంశంపై మాట్లాడేందుకు దళిత, గిరిజన శాసనసభ్యులకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా మైక్ అందుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ సభా సంస్కారాలను మరచిపోయారు. ‘కత్తుల కోలాటం ఆడుతం బిడ్డా.. ఏమనుకుంటున్నవ్.. మా పొడికత్తులు లేచాయనుకో.. మీ గడికి యేలాడ కడుతం’ అంటూ అభ్యంతరకర భాషతో ఊగిపోయారు. ‘బొక్కలో వేసి తొక్కుతం’ అంటూ వేలు ఎత్తి చూపిస్తూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు బెదిరించారు. పాడి కౌశిక్‌రెడ్డి ‘అసెంబ్లీ నక్సలైట్’గా మారారంటూ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దూషించారు.
ఈనేపథ్యంలోనే మైక్ అందుకున్న సీఎం రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌ను లేపి నిలబెట్టి, ‘మా దగ్గర కండలు తిరిగిన వాళ్లు ఉన్నారు అధ్యక్షా..’ అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేశారు. ‘..తిరిగేసి, బోర్లేసి కొట్టడానికి ఉన్నరు.. అధ్యక్షా..’ అంటూ అధికార పక్షం సభ్యులను రెచ్చగొట్టారు. కౌశిక్‌రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్టు ప్రకటించారు. హౌస్‌లో ఉన్న సీసీ ఫుటేజీని ఆధారంగా చేసుకొని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తామని తెలిపారు.
రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం భూ కుంభకోణాలు, అక్రమ మైనింగ్‌లకు పాల్పడున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శాసనసభ ఉప నాయకుడు హరీశ్‌రావు గత రెండు రోజులుగా అధికార పార్టీని ఇరుకునపెడుతున్నారు. జీవో-111 నిబంధనలు అమల్లో ఉన్న కొత్వాల్‌గూడలోని సర్వే నంబర్ 62,63లో అక్రమంగా మైనింగ్ జరుగుతున్నదని, డీజిల్ జనరేటర్లతో స్టోన్ క్రషర్లు నడుపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగరంలోని ఖరీదైన ప్రాంతంలో జరుగుతున్న ఈ అక్రమ మైనింగ్ ఎవరిదనే విషయాన్ని హరీశ్‌రావు చెప్పక ముందే, మంత్రులు ఒకరి తరువాత ఒకరు అందుకొని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేరు సభలో ప్రస్తావించారు. వాస్తవానికి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ చేస్తున్న మైనింగ్ అక్రమాలపై ఆరోపణలు ఉన్నాయని, సీఎం సహా సంబంధిత శాఖ మంత్రి కూడా సభ ముందు అంగీకరించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్కు తాము ఇచ్చిన నోటీసులనే బీఆర్ఎస్ పట్టుకున్నదని స్వయంగా సీఎం సభలో ప్రకటించారు. దీంతో హరీశ్‌రావు తన స్వరం మరింత పెంచారు. అక్రమ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రితో రాజీనామా చేయించి, అక్రమాల మీద హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. దీంతో పూర్తిగా ఇరుక్కపోయామని అర్థం చేసుకున్న అధికార పక్షం సభను వాయిదా వేయించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.