Pharma City | యాచారం, అక్టోబర్ 9: ‘ఫార్మాసిటీ వద్దు ఉయ్యాలో.. వ్యవసాయమే ముద్దు ఉయ్యాలో.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యా లో.. రైతులను ముంచింది ఉయ్యాలో’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బతుకమ్మ పాటలు మార్మోగాయి. ఫార్మాసిటీ వ్యతిరేక నినాదాలతో అక్కడి ప్రాంతం హోరెత్తింది. ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం ఫార్మా బాధిత రైతులు వినూత్న నిరసన చేపట్టారు.
గ్రామంలో ఉన్న ఫార్మా స్తూపం వద్ద మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన మహిళలు, రైతులు పెద్ద ఎత్తున గుమికూడారు. అక్కడే బతుకమ్మ ఆడుతూ నిరసన చేపట్టారు. కాం గ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ బతుక మ్మ ఆడారు. బతుకమ్మలకు హారతి ఇచ్చి ఘనంగా నిమజ్జనం చేశారు. అనంతరం ఫార్మాకు వ్యతిరేకంగా రైతుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సామాజిక వేత్త కవుల సరస్వతి మాట్లాడుతూ.. ఫార్మాసిటీని వెం టనే రద్దు చేయాలని కోరారు. ఫార్మాసిటీ.. ప్యూచర్ సిటీ అంటూ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నదని ఆమె మండిపడ్డారు.