‘మార్పు’ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రాష్ట్రంలో పెద్ద మార్పునే తెచ్చింది.. ‘పేదలను కొట్టాలె.. పెద్దలకు పెట్టాలె’ అన్న విధానాన్ని అమలు చేస్తున్నది. బడుగులు, పేద రైతులను టార్గెట్‌గా చేసుకొని ఏడాదిన్నరగా ఆయా వర్గాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. రోజుకో కూల్చివేత.. వారానికో బలవంతపు భూసేకరణ అన్నట్టుగా పల్లె, పట్టణం తేడా లేకుండా నిరుపేదలతో చెడుగుడాడుతున్నది.
బ్యాంకు రుణంతో ఇల్లు కట్టుకున్న సామాన్యుడు.. ఉపాధి కోసం రోడ్డు పక్కన షాపు పెట్టుకున్న చిరువ్యాపారి.. తరతరాలుగా ఒకట్రెండెకరాల అసైన్డ్ భూములే ఆధారంగా బతికీడుస్తున్న సన్న, చిన్నకారు రైతు.. ఏడాదిన్నరగా వీళ్లనే లక్ష్యంగా చేసుకొని రేవంత్ సర్కారు పాలన సాగుతున్నది. ‘కూల్చివేతలు-భూ సేకరణ’ అనేది సర్కారు బండికి జోడెడ్లుగా మారాయి. ఏడాదిన్నరగా రాష్ట్రంలో ఒక్క కొత్త ప్రాజెక్టుకూ తట్టెడు మట్టి తవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం, వందలకొద్దీ నిర్మాణాలను నేలకూల్చుతూ సామాన్యుల కంట కన్నీళ్లను పారిస్తున్నది.
హైదరాబాద్/సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ‘మార్పు’ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంతకంటే మించి ఏమున్నది గర్వకారణం? రోజుకో కూల్చివేత… వారానికో బలవంత భూసేకరణ తప్ప! ఇది నిజం. పట్టణం, పల్లె అనే తేడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం బడుగులతో చెడుగుడు ఆడుతున్నది. మునుపెన్నడూ అభివృద్ధి అనేదే లేనట్టుగా.. నిన్నటిదాకా పరిశ్రమలే ఏర్పాటు కానట్టుగా.. కూల్చివేతలు-భూసేకరణ అనేవి సర్కారు బండికి జోడెడ్లుగా మారాయి. రేవంత్ సర్కార్ గడిచిన ఏడాదిన్న కాలంలో రాష్ట్ర రాజధానిలో ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు చేపట్టి ఇటుక పేర్చకున్నా వందల సంఖ్యలో నేలమట్టమవుతున్న నిర్మాణాలతో సామాన్యుల కండ్లు కన్నీటి సంద్రాలవుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల, నగరానికి అనుకుని ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, యాదాద్రి-భువనగిరి వంటి జిల్లాల్లో తరచూ ఏదో ఒక ప్రాజెక్టు పేరుతో పొలాల్లో పోలీసుల పదఘట్టనలు… సర్వే అధికారుల ఉరుకులు పరుగులతో బడుగు రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కానీ, ఈ ప్రభుత్వ హయాంలో వందలాది పెద్దోళ్ల అక్రమ నిర్మాణాలు తెరపైకి వచ్చినా ఒక్క ఇటుక కూడా కదల్లేదు. పదుల సంఖ్యలో ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం జారీ అయిన భూసేకరణ నోటిఫికేషన్లలో ఒక్క బడా బాబుకు సంబంధించిన భూములు కనిపించవు.
హైదరాబాద్ నగరం
ప్రాజెక్టు: మూసీ, చెరువుల సుందరీకరణ, ట్రాఫిక్ సమస్య పరిష్కారం నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్. వేలాది చెరువులు వందల సంఖ్యలోకి వచ్చాయి. అనేకం కాలగర్భంలో కలిసిపోయాయి. చెరువులను పునరుద్ధరించి, సుందరీకరిస్తామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఏడాది కాలంగా చెరువుల్లో అక్రమ కట్టడాలు అంటూ వందలాది నిర్మాణాలను నేలమట్టం చేశారు. గతంలో అనుమతులు ఉన్న వాటినీ నేలకూల్చారు. కత్వ చెరువు పరిధిలో గృహప్రవేశం చేసి, మామిడి తోరణాలు వాడిపోకముందే బుల్డోజర్లకు బలైన సామాన్యుడి ఇల్లు ఉంది. సున్నం చెరువులాంటి ప్రాంతంలో కూల్చివేతలతో నిలువనీడ కోల్పోయి అంధకారంలో నెలల తరబడి బతుకీడ్చిన నిరుపేదలు ఉన్నారు. రోడ్డునపడిన కుటుంబాలూ ఉన్నాయి. మరోవైపు, ఫుట్‌పాత్ ఆక్రమణల పేరిట జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు పాన్‌డబ్బాలు, చిన్న గుడిసెల్లోని దుకాణాలను ధ్వంసం చేసి చిరు వ్యాపారులను రోడ్డున పడేసిన దాఖలాలు అనేకం.
ఇంకోవైపు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించారంటూ రేకులషెడ్లు, చిన్న గదులను బుల్డోజర్లతో నేలమట్టం చేసిన కేసులకూ ఈ ఏడాదిన్నరలో కొదువ లేదు. హృదయవిదారక విషయమేమంటే… ఒకట్రెండు మినహా మిగిలిన నిర్మాణాలన్నీ మధ్యతరగతి, నిరుపేదలవే. జంట జలాశయాలు మొదలు అనేక చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో బడా నిర్మాణ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పెద్దల సంబంధీకుల ఫాంహౌస్‌లు, విల్లాలూ ఈ జాబితాలో ఉన్నాయి. కానీ, కొందరి వైపు బుల్డోజర్లు చూడకపోవడం ఒకవంతైతే… హైకోర్టు స్టేలతో నిలుపుదల జరగడం మరోవంతు. మూసీ సుందరీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు బఫర్‌జోన్‌ను అప్పగించేందుకు కూడా సమిధగా మారింది నిరుపేదల నివాసాలే. నాలాల్లో నిర్ణీత సమయంలో పూడిక తీయక నిర్లక్ష్యం తాండవిస్తుండగా… ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో ముంపు సమస్యకు చక్కటి పరిష్కారమైన వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ)ను ఈ ప్రభుత్వం అటకెక్కించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొదటి దశ కింద అనేక కాలనీలకు శాశ్వతంగా ముంపు సమస్య నుంచి దీని ద్వారా విముక్తి కలిగింది.
రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం-మహేశ్వరం నియోజకవర్గాలు ప్రాజెక్టు: ఫార్మా సిటీ
భూసేకరణ విస్తీర్ణం: సుమారు 6వేల ఎకరాలు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రీన్ ఫార్మాసిటీ కోసం సుమారు 20 వేల ఎకరాలకు భూసేకరణ చేయాలని నిర్ణయించారు. అందులో దాదాపు 14,500 ఎకరాల వరకు సేకరణ పూర్తి చేసి ఫార్మాసిటీ ఏర్పాటును చివరి దశకు తీసుకొచ్చారు. అయితే, 2023 డిసెంబర్లో వచ్చిన రేవంత్ సర్కార్ ఫార్మాసిటీని రద్దు చేసింది. తీరా… న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలుసుకొని మాట మార్చింది. సాక్షాత్తూ హైకోర్టులో ఫార్మాసిటీని ఏర్పాటుచేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ పెద్దలే ఫార్మాసిటీ రద్దు అని అనేకసార్లు ప్రకటించారు. ప్రభుత్వం అనేక కంపెనీలకు ఇందులో నుంచే భూములను కేటాయిస్తుంది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం రైతులు తమ భూములను తిరిగి ఇవ్వాలని ఏడాదిన్నరగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా భూములు ఇచ్చిన వారికి పరిహారంగా 121 చదరపు గజాల ప్లాటు ఇవ్వకుండా ఆ ప్లాట్లు ఉన్న వెంచర్లో నుంచే ఈ ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మిస్తున్నది. ఇదేకాకుండా ఇంకా సేకరించిన సుమారు ఆరు వేల ఎకరాల భూములకు పరిహారం ఇవ్వకుండానే టీజీఐఐసీ అధికారులు భూములను స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేశారు. రైతుల పిటిషన్‌తో హైకోర్టు స్టే ఇచ్చినా ప్రభుత్వం ఖాతరు చేయకుండా భూములను స్వాధీనం చేసుకున్నది. దీంతో ఏడాదిన్నర నుంచి సన్న, చిన్నకారు రైతులు.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
వికారాబాద్ జిల్లా: కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ప్రాంతం
భూసేకరణ విస్తీర్ణం: 1,174 ఎకరాలు
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 1,174 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. ఇందులో దాదాపు 900 ఎకరాల వరకు అసైన్డ్ భూములే. పైగా ఇందులో అత్యధికంగా గిరిజన రైతులే సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పచ్చని పొలాల్లో ఫార్మా చిచ్చు పెడుతున్నారంటూ రైతులు అభ్యంతరం వ్యక్తంచేశారు. కానీ, కొందరు కాంగ్రెస్ నేతలే దళారులుగా మారి రైతులను మభ్యపెట్టి ఆ భూములు ప్రభుత్వానికి ఇస్తున్నట్టుగా రైతుల పేరిట తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఈ వాస్తవాన్ని తెలుసుకున్న గిరిజన రైతులు, మహిళలు, చిన్నా పెద్దా తేడా లేకుండా కడుపుమండి మర్లబడ్డారు. దీనికి ప్రతీకార చర్యగా ప్రభుత్వం పోలీసులను మోహరించి… రాత్రిపూట, కరెంటు తీసి ఇండ్లల్లోకి చొరబడి దౌర్జన్యంగా వారిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఏకంగా జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల మీద దాడి చేశారంటూ 72 మంది గిరిజన రైతులపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపారు. ఈ దమనకాండలో బీఆర్ఎస్ పార్టీ గిరిజనులకు అండగా నిలిచి ప్రభుత్వ దమననీతిని జాతీయ స్థాయిలో ఎత్తిచూపింది. రెండు నెలలకుపైగా జైలు జీవితాన్ని గడిపిన గిరిజనులు తమ భూములను ఇచ్చేదిలేదంటూ భీష్మించుకుకూర్చున్నారు. అయినా ప్రభుత్వం వారిని మభ్యపెట్టి గుట్టుచప్పుడు కాకుండా భూసేకరణ సాగిస్తున్నది.
జోగులాంబ గద్వాల జిల్లా: రాజోళి మండలం పెద్ద ధన్వాడ ప్రాజెక్టు: ఇథనాల్ ఫ్యాక్టరీ
పెద్దధన్వాడ గ్రామంలో వ్యవసాయం పేరిట ఏపీకి చెందిన జీఆర్ఎఫ్ కంపెనీ తొలుత 27.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఆ తరువాత ఆ భూమిలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పూనుకున్నది. పచ్చని పొలాల మధ్య కాలుష్యం వెదజల్లే ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేయొద్దటంఊ స్థానిక రైతులతోపాటు, పెద్దధన్వాడ చుట్టపక్కల రైతులు సైతం వ్యతిరేకిస్తూ నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ, కంపెనీ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ రైతులు చెప్పులరిగేలా తిరిగినా పనులు మాత్రం ఆగడం లేదు. దీంతో కడుపుమండిన రైతులు తిరగబడ్డారు. ఈ నెల 4న రైతులంతా కలిసి ఫ్యాక్టరీ పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన లాఠీచార్జ్‌లో గాయపడినా రైతులు లెక్క చేయలేదు. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు వంద మంది రైతులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన తర్వాత అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండటంతోపాటు రైతులు తాము వెనక్కి తగ్గేదిలేదంటూ పట్టుబట్టి కూర్చున్నారు. మున్ముందు ఆందోళనలకు కార్యాచరణ సిద్ధంచేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా: యాచారం మండలం మొండిగౌరెల్లి ప్రాజెక్టు: పరిశ్రమల అవసరాలు..
భూసేకరణ విస్తీర్ణం: 680 ఎకరాలు
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లిలో ప్రస్తుతం ఈ భూసేకరణ అనేది రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది. ఈ భూములన్నీ అసైన్డ్ భూములు. ఇందిరాగాంధీ హయాంలో పంపిణీ చేసిన ఈ భూములను ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ పరిశ్రమల అవసరాల పేరిట గుంజుకునేందుకు సిద్ధమైంది. సర్వే కోసం వస్తున్న అధికారులను రైతులు అడ్డుకుంటున్నారు. భూభారతి సదస్సును సైతం అడ్డుకుని తమ భూములను తీసుకోవద్దంటూ ఆర్డీవో, తహసిల్దార్‌ను నిలదీశారు.
యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ప్రాజెక్టు: ట్రిపుల్ ఆర్ (ప్రాంతీయ రింగు రోడ్డు)
భూసేకరణ విస్తీర్ణం: సుమారు 180 ఎకరాలు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌కు సంబంధించి ఉత్తర, దక్షిణ భాగాలు కొలిక్కి వచ్చాయి. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దక్షిణ భాగం అష్టవంకరలు తిరిగింది. సాధారణంగా క్లిష్టమైన, అనివార్య పరిస్థితుల్లోనే అలైన్మెంట్ మార్పు అనేది జరుగుతుంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతుల భూములను చీల్చుకుంటూ కొందరు ప్రభుత్వ పెద్దలు, బంధువులకు సంబంధించిన వందల ఎకరాలకు రాచమార్గంలా రింగు రోడ్డును రూపుదిద్దుతున్నది. ఈ క్రమంలో మిగిలినచోట్ల అవుటర్ రింగు రోడ్డుకు 40-45 కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్లే త్రిపుల్ ఆర్ అలైన్మెంట్.. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ ప్రాంతానికి వచ్చేసరికి కేవలం 27-28 కిలోమీటర్ల దూరంలో నుంచే వెళ్తున్నది. దీంతోపాటు గతంలో చౌటుప్పల్ దగ్గర జంక్షన్ ఏర్పాటుకు 72 ఎకరాలను సేకరించేందుకు నిర్ణయించి, హద్దులు కూడా నిర్ధారించారు. కానీ, దానిని కూడా మార్చి ఏకంగా 180 ఎకరాలకుపైగా భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడంతో రైతులు, మధ్య తరగతి ప్రజలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇందులో కొన్ని కాలనీలు కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉన్నది. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి మొరపెట్టుకోవడం ఆ ప్రాంత రైతుల నిత్యకృత్యంగా మారింది. కానీ, ప్రభుత్వం మాత్రం వారి ఆవేదనను పట్టించుకోవడం లేదు.
రంగారెడ్డి జిల్లా : కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు మండలాలుప్రాజెక్టు: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు
భూసేకరణ విస్తీర్ణం: 1000 ఎకరాలు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న ఫార్మాసిటీలో భాగంగా విశాలమైన రహదారులు నిర్మించారు. కానీ, రేవంత్ సర్కార్ ఇవి కాకుండా ప్రత్యేకంగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు అంటూ ఏకంగా 330 ఫీట్ల రోడ్డును చేపట్టింది. ఇందుకోసం అవుటర్ రింగు రోడ్డు ఎగ్జిట్ నంబర్-13 నుంచి ఆకుతోటపల్లి వరకు వెయ్యి ఎకరాల భూములను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి… సర్వే పూర్తి చేసి… హద్దులు కూడా నిర్ధారించింది. ఈ రహదారి అత్యధిక భాగం ఒకట్రెండు ఎకరాలు ఉన్న సన్న, చిన్నకారు రైతుల భూముల నుంచే పోతుండటం గమనార్హం. వీటికితోడు ఈ రహదారిని అనుసరించి అనేకమంది బడాబాబులకు వందల ఎకరాల భూములు ఉండటం గమనార్హం.
రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం-మహేశ్వరం నియోజకవర్గాలు ప్రాజెక్టు: ఫ్యూచర్ సిటీ
భూసేకరణ విస్తీర్ణం ; సుమారు 14-15వేల ఎకరాలు
ఫార్మాసిటీని కొనసాగిస్తామని హైకోర్టులో లిఖితపూర్వక హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఆ భూముల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నది. 30 వేల ఎకరాల్లో ఈ నగరాన్ని నిర్మించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రీన్ ఫార్మాసిటీ కోసం సేకరించిన 14,500 ఎకరాల వరకు ఉన్నది. ఇదిపోను ఇంకా 15-16 వేల ఎకరాల భూమిని సేకరించనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చింది. దీంతో ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల పరిధిలోని అసైన్డ్ భూముల్లోని రైతులకు కంటిమీద కునుకు కరువైంది. ఏక్షణంలో అధికారులు వచ్చి తమ భూముల్లో సర్వే చేసి, స్వాధీనం చేసుకుంటారోనన్న భయం వారిని వెంటాడుతున్నది. ఈ ఏడు మండలాల పరిధుల్లో బడాబాబులకు సంబంధించి వందల ఎకరాల బిట్లు ఉన్నాయి. కానీ ప్రభుత్వం చేపట్టే భూసేకరణ కేవలం సన్న, చిన్నకారు రైతులు అందునా అసైన్డ్ భూముల్లోనే ప్రధానంగా ఉంటుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్, నల్లవల్లిప్రాజెక్టు: డంపింగ్ యార్డు
భూసేకరణ విస్తీర్ణం: 150 ఎకరాలు
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంపింగ్ యార్డు కోసం లక్డారం, ప్యారానగర్ ప్రాంతాల్లో స్థలాన్ని ఎంపికచేశారు. ప్యారానగర్‌కు సంబంధించిన 150 ఎకరాల భూమిని సేకరించేందుకు నిర్ణయించారు. యూరోపియన్ టెక్నాలజీతో డంపింగ్ యార్డుని నిర్మిస్తామని జీహెచ్ఎంసీ చెప్తున్నది. ప్రతిరోజూ 130 వాహనాల్లో రెండు వేల టన్నుల చెత్తను ప్యారానగర్కి తరలిస్తారని అంచనా. నల్లవల్లి, ప్యారానగర్, గుమ్మడిదల గ్రామాల ప్రజలు డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తున్నారు. గత 120 రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజలు, రైతులు ఆందోళన చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ మండలం ఎనికెపల్లి గ్రామం ప్రాజెక్టు: గోశాల
భూసేకరణ విస్తీర్ణం: 99.14 ఎకరాలు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికెపల్లి రెవెన్యూ పరిధిలో 180 సర్వే నంబర్లో 99.14 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూములను గ్రామానికి చెందిన 50 మంది ఎస్సీ, బీసీ నిరుపేదలు 70 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. ఇందిరాగాంధీ హయాంలో ఈ భూపంపిణీ జరగడంతో చాలామంది రైతుల దగ్గర అప్పటి తోక పాసుపుస్తకాలు, 1983 వరకు చెల్లించిన శిస్తు రశీదులు కూడా ఉన్నాయి. ప్రభుత్వ భూమి అని రికార్డుల్లో నమోదవుతూ వస్తున్నా.. రైతులు కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్నారు. తాజాగా అక్కడ గోశాల ఏర్పాటుకు రైతుల నుంచి భూములను తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతులను ఖాళీ చేయాలని హుకుం జారీచేశారు.
నిర్మల్ జిల్లా: దిలావర్పూర్ మండలం గుండంపల్లిప్రాజెక్టు: ఇథనాల్ ఫ్యాక్టరీ
నిర్మాల్ జిల్లా దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ రైతులు తిరుగుబాటు చేశారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో నిరుడు నవంబర్‌లో బుస్సెపల్లి, సముందర్‌పల్లి, దిలావర్పూర్, గుండంపల్లి రైతులు రోడ్డెక్కారు. రిలేదీక్షలకు పూనుకున్నారు. రైతుల వేదనను అర్థం చేసుకోవాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా… తిరుగుబాటు చేసిన దాదాపు 307 మంది రైతులపై కేసులు నమోదుచేసింది.
నల్లగొండ జిల్లా ఇర్విన్ ప్రాజెక్టు: దిండి లిఫ్ట్ ఇరిగేషన్
భూసేకరణ విస్తీర్ణం : 3900 ఎకరాలు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడినుంచి లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి నల్లగొండ, భువనగిరి జిల్లాల్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనేది ప్రణాళిక. దిండి నుంచి టన్నె ల్, ప్రధాన కాలువల పనులకు దాదాపు 3,900 ఎకరాలను సేకరించాల్సి ఉన్నది. అయితే పరిహారం చెల్లించకుండానే భూసేకరణ చేపట్టడంతో రైతులు వ్యతిరేకిస్తున్నారు.
నారాయణపేట జిల్లా ఉట్కూర్, మక్తల్, బల్మూర్, దౌల్తాబాద్, కొడంగల్ మండలాలు.. ప్రాజెక్టు: కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ స్కీమ్
భూసేకరణ విస్తీర్ణం : 1260 ఎకరాలు
రాజీవ్ భీమా లిఫ్ట్ స్కీమ్‌లో భాగమైన భూత్పూర్ రిజర్వాయర్ నుంచి జలాలను ఎత్తిపోసి కొడంగల్-నారాయపేట జిల్లాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 4 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉన్నది. అయితే భూములిచ్చేది లేదంటూ ఆయా మండలాల రైతులు తెగేసి చెప్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం ప్రాజెక్టు: ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్
భూసేకరణ విస్తీర్ణం: 2,180 ఎకరాలు
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక్వర్గంలోని నల్లమల్ల అటవీప్రాంతంలో ఎగువ ప్రాంతాల్లో 70 వేల ఎకరాలకు సాగునీరందించాలని ప్రణాళికలను సిద్ధంచేశారు. 2,180 ఎకరాలను బల్మూర్, ఉప్పునుంతల, అనంతవరం, అంబగిరి, మైలారం మండలాల పరిధిలోని 56 గ్రామాల్లో సేకరించాల్సి ఉన్నది. భూసేకరణను రైతులు వ్యతిరేకిస్తున్నారు.
వరంగల్: వీధివ్యాపారులపై ప్రతాపం
ఇటీవల జరిగిన అందాల పోటీల్లో భాగంగా కంటెస్టెంట్లు వరంగల్ జిల్లాను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా వరంగల్ నగరంలోని కాజీపేట నుంచి వరంగల్ రైల్వేస్టేషన్ వరకు ఉన్న వీధి వ్యాపారులకు సంబంధించిన దుకాణాలను ప్రభుత్వం తొలగించింది. వీరిలో అత్యధికులు గత 12 ఏండ్లుగా అక్కడే చిరువ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరికి స్ట్రీట్ వెండర్ గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ అధికారులు కనికరించలేదు. నిర్దాక్షిణ్యంగా షాపులను కూలగొట్టారు. దీంతో ఆయా వీధి వ్యాపారులు ఇప్పటికే ఇరవై రోజులుగా ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణాలను తొలగించడం వల్ల ఒక్కొక్కరు కనీసం రూ.పదివేలకుపైగా నష్టపోయినట్టు బాధితులు చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ను కలిసినా ఫలితం లేకుండాపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.