రంగారెడ్డి, మే 29 (నమస్తేతెలంగాణ) : ఫార్మాసిటీని రద్దుచేస్తే ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం ఫార్మాసిటీ బాధిత ప్రాంతాల రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఫార్మాసిటీపై ప్రభుత్వం పూటకోమాట మారుస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మాసిటీని రద్దుచేస్తున్నామని ఆ పార్టీ నేతలు ప్రకటించారని, కానీ ప్రభుత్వం మాత్రం ఫార్మాసిటీని అక్కడే నిర్మిస్తామని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తుచేశారు. ఫార్మాసిటీని రద్దుచేస్తే వెంటనే ఆ భూములను తిరిగి రైతులకే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, మల్రెడ్డి రంగారెడ్డి ఫార్మా అనుబంధ గ్రామాల్లో పర్యటించి తమ పార్టీని గెలిపిస్తే ఫార్మాసిటీని రద్దుచేసి ఆ భూములను తిరిగి రైతులకే ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడంలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాల్లో భూసేకరణ చేపట్టిందని, ఈ భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు ఒక గుంటచొప్పున ఇండ్ల స్థలాలు కేటాయించిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. సుమారు 500 ఎకరాల్లో లేఅవుట్‌ను ఏర్పాటుచేసి బాధిత రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టాలు ఇచ్చామని చెప్పారు. పట్టాలు పొందిన రైతులకు ఇండ్ల స్థలాలు చూపించాల్సి ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతున్నా కూడా పట్టాలు పొందినవారికి ఇండ్లస్థలాలు చూపించటంలేదని విమర్శించారు. గత సంక్రాంతి పండుగలోపే పట్టాలు పొందిన రైతులందరికి ప్రభుత్వ ఖర్చుతోనే రిజిస్ట్రేషన్లు చేయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు వారికి ఇండ్ల స్థలాలు కేటాయించలేదని అన్నారు. 15 రోజుల్లో పట్టాలు పొందిన రైతులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఫార్మాసిటీ ఏర్పాటుకోసం ప్రభుత్వం సేకరించిన భూమి కాకుండా అదనంగా మరో రెండువేల ఎకరాల పట్టా భూములను ప్రభుత్వం రైతులకు తెలియకుండానే వారిపేర్లను నిషేధిత జాబితాలో చేర్పించిందని సబితారెడ్డి అన్నారు. వారి భూములకు ఇష్టానుసారంగా పరిహారాన్ని ప్రకటించిందని, ఆ పరిహారం కూడా కోర్టులో జమచేశారని పేర్కొన్నారు. పట్టా భూములివ్వటానికి రైతులు ఒప్పుకోనందున ఆ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.