శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 01:28:14

తలసరి ఆదాయం డబుల్‌

తలసరి ఆదాయం డబుల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా ప్రజల తలసరి ఆదాయం గత ఆరేండ్లలో రెట్టింపైంది. తెలంగాణ ఏర్పడేనాటికి 2013-14 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.1.12 లక్షలు ఉండగా.. 2018-19నాటికి 2.28 లక్షలకు చేరింది. అంతేకాదు రాష్ట్ర జీఎస్డీపీ విలువ సైతం రెట్టింపునకు పెరిగినట్టు రాష్ట్ర ప్రణాళిసంఘం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  గత నాలుగేండ్లలో తలసరి ఆదాయంలో వృద్ధిరేటు సగటున 13.3 శాతం నమోదైంది. తద్వారా సిక్కిం తర్వాత దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. అదే సమయంలో దేశ సగటు ఆరేండ్లలో రూ.79వేల నుంచి రూ.1.34 లక్షలకు పెరిగింది. సగటు వృద్ధిరేటు 9.5 శాతంగా ఉన్నది.  రంగారెడ్డి జిల్లా రూ. 5.78 లక్షలతో మొదటి స్థానంలో ఉండగా.. రూ. 3.57 లక్షలతో హైదరాబాద్‌ రెండో స్థానంలో, రూ. 2.21 లక్షలతో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి మూడో స్థానంలో, రూ. 1.94 లక్షలతో మహబూబ్‌నగర్‌ నాలుగో స్థానంలో, రూ. 1.85 లక్షలతో మెదక్‌ జిల్లా ఐదో స్థానంలో నిలువడం విశేషం.  

జీఎస్డీపీ రూ.9.69 లక్షల కోట్లకు 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌ (జీఎస్డీపీ) విలువ సైతం రెట్టింపయ్యింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.4.51 లక్షలుగా ఉన్న జీఎస్డీపీ.. 2019-20 నాటికి రూ.9.69 లక్షల కోట్లకు పెరిగింది. ఏటా సగటున 14 శాతం వృద్ధిరేటు సాధించింది. అదే సమయంలో దేశ సగటు వృద్ధిరేటు 10 శాతానికే పరిమితమైంది. రాష్ర్టాల వారీగా గత నాలుగేండ్ల జీఎస్డీపీ వృద్ధిరేటును పరిశీలిస్తే తెలంగాణ 14.2 శాతంతో దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది.