న్యూఢిల్లీ, మే 10: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన 50 రోజుల తర్వాత శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వీలుగా జూన్ 1వ తేదీ వరకు 21 రోజుల పాటు ఆయనకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న కేజ్రీవాల్ తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. జూన్ 5 వరకు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు ధర్మాసనం షరతులు విధించింది. ఢిల్లీ సచివాలయం, సీఎం కార్యాలయానికి వెళ్లొద్దని ఆదేశించింది. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆమోదం పొందాల్సిన తప్పనిసరి ఫైళ్లు తప్ప ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకం చేయొద్దని పేర్కొన్నది. కేసుకు సంబంధించి తన పాత్ర గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, సాక్షులను కలవొద్దని, కేసుకు సంబంధించిన అధికారిక ఫైళ్లను చూడొద్దని ఆదేశించింది.
కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని, ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ మంజూరు చేసిన దాఖలాలు గతంలో లేవని ఈడీ తరఫు న్యాయవాదులు చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసులో 2022 ఆగస్టులో ఈడీ దర్యాప్తు ప్రారంభించి, ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేసిందని, అంటే, ఏడాదిన్నర పాటు కేజ్రీవాల్ బయటే ఉన్నారని కోర్టు పేర్కొన్నది. 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడం వల్ల తేడా ఏమీ ఉండదని పేర్కొన్నది. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడం ద్వారా దేశంలో సాధారణ ప్రజలతో పోలిస్తే రాజకీయ నేతలు ప్రయోజనం పొందే స్థితిలో ఉంటారని చెప్పినట్టు అవుతుందని ఈడీ తరఫు న్యాయవాది చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయనే విషయంలో సందేహం లేదని, అయితే అవి నిరూపితం కాలేదని పేర్కొన్నది. ఆయనకు నేరపూరిత చరిత్ర లేదని, సమాజానికి ఆయన ముప్పు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ముఖ్యంగా ఆయన అరెస్టులో చట్టబద్ధత, చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది.
తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదలైన కేజ్రీవాల్‌కు ఆప్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ… ‘నియంతృత్వానికి వ్యతిరేకంగా నా శక్తిమేర పోరాడుతున్నాను. 140 కోట్ల దేశ ప్రజలు సైతం కలిసికట్టుగా పోరాడాలి. కోట్లాది మంది దేశ ప్రజలు నాకు ఆశీర్వాదాలు పంపించారు. వారందరికీ, సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు.’ అని పేర్కొన్నారు.
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడం పట్ల ఆయన సతీమణి సునీత సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇది ప్రజాస్వామ్య విజయం. లక్షలాది మంది ప్రజల ఆశీస్సులు, ప్రార్థనల ఫలితం. అందరికీ ధన్యవాదాలు’ అని ఆమె ట్వీట్ చేశారు. కేజ్రీవాల్‌కు బెయిల్ లభించడం పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమత సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ స్వాగతించారు. దేశంలోని నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌కు న్యాయం, ఉపశమనం లభించడం మార్పు పవనాలకు భారీ సంకేతమని శివసేన(యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు.