Harish Rao | హుస్నాబాద్, మే 10: కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశంలోని కార్మికులు, కర్షకులు, పేద, సామా న్య ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు ఏకంగా రూ.14 లక్షల కోట్లు మాఫీచేసిన మోదీ ప్రభుత్వం దేశంలోని పేదల నడ్డివిరుస్తూ నిత్యావసర ధరలు పెంచిందని ఆరోపించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ రుణాలను కోట్లల్లో మాఫీచేసిన మోదీ ప్రభుత్వం పేదల రుణాలను పైసా కూడా మాఫీ చేయలేదని తెలిపారు.
బీజేపీ విధానాలతో 700 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుళ్ల బొమ్మలు పంపిణీచేసి ఓట్లు అడుగుతున్న బీజేపీకి ఓటు వేస్తే, కడుపు నిండదు అని అన్నారు. అయోధ్యలో రామాలయం కట్టింది బీజేపీ కాదని, ప్రజలు ఇచ్చిన విరాళాలతో ట్రస్టు ఆధ్వర్యంలో ఆలయం నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పడంలో రాహుల్‌గాంధీ సీఎం రేవంత్‌రెడ్డిని మించిపోయారని, ఇటీవల జరిగిన సభల్లో మహిళలకు రూ.2,500 ఇచ్చామని చెప్పడం ఆయన అవగాహనలోపానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. అబద్ధాల పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారని వెల్లడించారు.
హుస్నాబాద్‌కు మెడికల్ కళాశాల ఇస్తామని హామీ ఇచ్చిన ప్రియాంకగాంధీ అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. మళ్లీ కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని చెప్పిన ఆయన.. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువమంది గెలిస్తేనే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందని తెలిపారు. బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్‌షోలో మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, సిద్దిపేట జడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీ లకావత్ మానస పాల్గొన్నారు.