హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మను తొలగించిన దుర్మార్గుడిని తరిమికొట్టే వరకు, తెలంగాణ తల్లి చేతిలో తిరిగి బతుకమ్మను పెట్టే వరకు పోరాటం ఆగొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను తిరిగి సీఎంను చేసేవరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో బుధవారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మన భాషను, సంస్కృతిని అందరి ముందు గర్వంగా నిలపాలని కేసీఆర్ పరితపించారని పేర్కొన్నారు. “తెలంగాణ బిడ్డ దుబ్బాకలో ఉన్నా, దుబాయిలో ఉన్నా, వారాసిగూడలో ఉన్నా, వాషింగ్టన్లో ఉన్నా, అమీర్‌పేటలో ఉన్నా, ఖైరతాబాద్‌లో ఉన్నా, ఖతర్‌లో ఉన్నా బతుకమ్మ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం” అని తెలిపారు.
ఉద్యమ సమయంలో వందలాది బలిదానం చేసుకున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పోరాటంతో తెలంగాణ సిద్ధించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ భాషలో, యాసలో ఒకపాట కూడా వినబడని పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. అలాంటి తెలంగాణలో మన పాటలు వినిపిస్తున్నాయని చెప్పారు. పేర్చిన తంగెడుపూలను చూస్తుంటే ఒక్కో అమరుడు నవ్వుతున్నట్టుగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పీపుల్స్ ప్లాజాను బతుకమ్మ ప్లాజాగా మార్చుకుందామని చెప్పారు.
భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మన భాషను, సంస్కృతిని కాపాడుకునేలా ముందుకుపొదామని అన్నారు. రామక్క, దేఖ్లేంగే పాటలకు ఆడబిడ్డలు హుషారుగా స్టెప్పులు వేశారని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాళోజీని గుర్తు చేస్తూ రాసిన బతుకమ్మ పాటల సీడీని కేటీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, కౌశిక్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, రవీందర్రావు, వాణీదేవీ, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకకు నగరవ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చుకొని ఆడి పాడుతూ హుషారుగా గడిపారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ స్టెప్పులు వేశారు. రామక్క, ఔర్ఏక్ ధక్కా..కేసీఆర్ పక్కా పాటలకు కదం కలుపుతూ ఉత్సాహంగా గడిపారు. బతుకమ్మ పాటలతో ట్యాంక్ బండ్ హోరెత్తింది. ఈ వేడుకలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్టెప్పులు వేసి అలరించారు.