కరీంనగర్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఏడాదిన్నర కాలంగా ప్రజలకు చేసిందేమీలేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జన సమీకరణపై మంగళవారం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు.
కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారని, కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్ర ప్రజలు మరోసారి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి 10 వేల మందికి పైగా జనాన్ని తరలించాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు.