Municipal Elections | హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ‘మాకు తిరుగేలేదు.. మాకెవరూ అడ్డురారు’ అని విర్రవీగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పురపాలక ఎన్నికల్లో బీఆర్ఎస్ ముకుతాడు వేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు తరువాత నేలవిడిచి సాముచేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్‌ను భూమార్గం పట్టించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, కుయుక్తులు పన్నినా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేందుకు గూండాగిరిని ఆశ్రయించినా, అధికారాన్ని అడ్డంపెట్టుకొని అందుబాటులో ఉన్న అన్నిమార్గాలను తమకు అనుకూలంగా యథేచ్ఛగా వాడుకున్నా పట్టణ ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని శుక్రవారం విడుదలైన ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ గుర్తుతో జరిగిన మొదటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ వీరోచితంగా పోరాడి ప్రజల మనసుల్లో తమ స్థానాన్ని పదిలపరుచుకున్నది.
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలైనా రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ నిరూపించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన దాదాపు నాలుగువేల మందికిపైగా సర్సంచ్‌లు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంటే గులాబీ మద్దతుతో బరిలో దిగిన 40-45శాతం మంది అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అదేస్ఫూర్తిని ప్రదర్శించింది.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు మించిన ఫలితాలు సాధించింది. సీఎం రేవంత్‌రెడ్డి కాలికి బలపం కట్టుకొని తిరిగినా పట్టణ ఓటరు ఆయన మాటను పెడచెవిన పెట్టారు. రేవంత్‌రెడ్డి ప్రచారం చేసిన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి ఏకముఖంగా ఫలితాలు రాలేదు. సాధారణంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ, రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లకు పెట్టిన పంచాయతీ ఎన్నికల్లో, రెండున్నరేండ్ల తర్వాత నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చేదు అనుభవమే ఎదురైందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవని బీఆర్ఎస్ పార్టీ పని ఇక అయిపోయిందని విర్రవీగిన వారి వెన్నుల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వణుకు పుట్టించాయి. బీఆర్ఎస్ జీరో కాదు.. కాబోయే హీరో అనే రీతిలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సాధించామని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ‘బీఆర్ఎస్ పని అయిపోయింది’ అని కాంగ్రెస్ అనుకూల మీడియా, ఆ పార్టీ సోషల్ మీడియా ఎన్ని అపోహలు సృష్టించినా, ప్రజలు తమ వెంటే ఉన్నారని బీఆర్ఎస్ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి. దీనికి తాజా ఫలితాలు మద్దతుగా నిలుస్తున్నాయి.
అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా వాటిని లెక చేయకుండా క్యాడర్ సత్తా చాటుకున్నదని, కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిందని ఈ ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు కూడబలుక్కొని తమను నిలువరించాలని చూసినా 25 మున్సిపాలిటీలు గెలిచి, 740కిపైగా వార్డుల్లో గులాబీ జెండా ఎగురవేశామని, 35 చోట్ల కాంగ్రెస్ తేల్చుకోలేక బీఆర్ఎస్ కొరకరాని కొయ్యగా మారిందని అంటున్నారు. ఇది రాష్ట్రంలో బీఆర్ఎస్ సృష్టించబోయే సునామీకి సంకేతమని ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పేర్కొంటున్నారు. ఈ ఫలితాలతో తమ బాధ్యత, ఉత్సాహం పెరిగాయని అంటున్నారు.
ప్రజాస్వామ్య వేదికల మీద, ప్రజాక్షేత్రంలోనూ ప్రభుత్వ వైఫల్యాలను తాము ఎండగడుతూనే ఉంటామని, తమ ప్రశ్నలకు మరింత పదునుపెడతామని బీఆర్ఎస్ స్పష్టం చేస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై తమపై బీటీమ్ అని ముద్రవేయాలని చూసినా తమ లక్ష్యం నుంచి తాము దూరంకాబోమని, జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా తమ లోకల్ సత్తాను చాటుతూ ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శిస్తామని నేతలు అంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీని నిలువరించాలని కాంగ్రెస్ సర్కార్ సర్వశక్తులొడ్డినా ఫలితం లేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి రాకపోయినా, ‘బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి’ అంటూ కనీసం మీడియా ప్రకటన ఇవ్వకపోయినా పురజనం బీఆర్ఎస్వైపే ఓటేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పార్టీ శ్రేణుల కోరిక మీద చివరి రెండు రోజులు కొన్ని మున్సిపాలిటీల్లో పర్యటించారు.
అయినా అంతకుమించి ఫలితాలు ఇచ్చి ప్రజలు తమ గుండెల్లో ఉన్న గులాబీ అభిమానాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులుచేసి భయబ్రాంతులకు గురిచేసినా, కిడ్నాప్ చేసినా, నామినేషన్ల ఉపసంహరణ రోజు బీఆర్ఎస్ అభ్యర్థులను తమ అభ్యర్థులుగా మార్చేందుకు చివరికి బీ-ఫామ్స్ మార్చి ప్రజాస్వామ్యాన్ని ఏమార్చే ప్రయత్నం చేసినా సరే, అన్నీ గమనించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగుణపాఠం చెప్పారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.