రంగారెడ్డి : ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓట్ల కోసం మీ ఇండ్ల ముందుకు అందరూ వస్తారు. కాంగ్రెస్, బీజేపోళ్ల మాటలు నమ్మి మోసపోతే మళ్లీ గోసపడుతామని..ఎన్నికల ముందు ఎవరు కూడా ఆగమాగం కావద్దని సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి(Minister Mahender Reddy) అన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని సురంగల్, కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వివిధ అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి ఆకాశమే హద్దుగా నిలువడంతో దేశం తెలంగాణ వైపు చూస్తుందని పేర్కొన్నారు. ధనవంతుల పిల్లలకు అందినట్లుగా పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బడిముబ్బడగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని చెప్పారు. అరవై ఏండ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామని..కాంగ్రెస్‌ను గెలుపించాలని వస్తున్నారని, కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మోద్దని అన్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్, బీజేపోళ్లు గ్రామాల్లో తిరుగుతూ తమ ఉనికి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎవరు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలు దీవించడానికి సిద్దంగా ఉన్నారని, ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేయడాననికి ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. చేవెళ్ల ఎమ్మెల్యేగా కాలె యాదయ్యను, ఎంపీగా రంజిత్‌రెడ్డిని మరో సారి దీవించి ఆశీర్వదించి గెలుపిస్తే మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమలలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలలె శ్రీకాంత్, సురంగల్ సర్పంచ్ గడ్డం లావణ్య, ఎంపీటీసీ పట్లోళ్ల పద్మమ్మ, ఉపసర్పంచ్ యాదమ్మ, కేతిరెడ్డిపల్లి సర్పంచ్ దారెడ్డి శోభ, ఎంపీటీసీ ఆర్ అర్చన, ఉపసర్పంచ్ సిద్దయ్య, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రావూప్, తదితరులు పాల్గొన్నారు.