శాయంపేట, అక్టోబర్ 5 : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజలు ఆ పార్టీ నాయకులను నిలదీయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేటలోని బీసీ కాలనీలో ఆదివారం ఆయన ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డులను అందజేశారు. అనంతరం శాయంపేట సెంటర్లో జరిగిన సభలో మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. 22 నెలల కాలంలో సర్కార్ అన్ని వర్గాల వారికి ఎంతో బాకీ పడిందని దుయ్యబట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంటింటికీ వచ్చే ఆ పార్టీ నాయకులను ‘బాకీ చెల్లించు.. ఓటు అడుగు’ అని నిలదీయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల్లో రూ.2 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిందని ఆరోపించారు. ఏం నిర్మాణాలు చేపట్టారని, ఎలాంటి ఆస్తులు సృష్టించారని ప్రశ్నించారు. కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే మళ్లీ ఎరువుల కోసం చెప్పులు క్యూలైన్లో ఉంటాయని, రోజంతా కష్టాలు తప్పవని కేసీఆర్ ఆ నాడే చెప్పారని, ఇప్పుడు అదే నిజమైందని అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుండా దికుమాలిన పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నదని అన్నారు. రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో నిలువదని తెలిసినా ఎన్నికలకు వెళ్లడం ప్రజలను మభ్యపెట్టడమేనని మండిపడ్డారు.