హైదరాబాద్, మార్చి 17(నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అదానీ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాల్సిందేనని, వాస్తవాలను బయటకు తెచ్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాల్సిందేనన్న డిమాండ్‌తో ఎంపీలు శుక్రవారం కూడా తమ ఆందోళనలు కొనసాగించారు. బీఆర్ఎస్, ఇతర విపక్ష సభ్యుల ఆందోళన, నినాదాలతో ఉభయసభలు స్తంభించిపోయాయి. అదానీ అంశంపై చర్చ చేపట్టడంతో పాటు జేపీసీ వేయాలని, దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎంపీలు రెండు సభల్లో పోడియం చుట్టుముట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే చర్చకు కేంద్ర ప్రభుత్వం విముఖత చూపడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభలో ఎంపీ కే కేశవరావు, లోక్‌సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు నాయకత్వంలో బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్, చైర్మన్ల వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు.
ఉభయ సభల వాయిదా అనంతరం బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన(యూబీటీ), జేఎంఎం, వామపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. కేంద్రం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేయడంతో పాటు ప్లకార్డులు ప్రదర్శించారు. అదానీ గ్రూపు అక్రమాలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అదానీ అంశంపై చర్చకు వెనుకాడుతున్నదని మండిపడ్డారు. ‘మోదీ సర్కార్ డౌన్ డౌన్, మోదీ సర్కారు షేమ్ షేమ్, వీ వాంట్ జేపీసీ, సేవ్ ఎల్ఐసీ’ అంటూ ఎంపీలు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కేఆర్ సురేశ్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డిలు కంజర కొడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు.
నిరసన ప్రదర్శన సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ అదానీ అంశంపై జేపీసీ వేసి, పార్లమెంట్లో చర్చకు అనుమతించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులంతా దేశ రాజధాని ఢిల్లీలో న్యాయం కోసం రోడ్ల మీదకు వచ్చి ఉద్యమిస్తుంటే ప్రధాని మోదీ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం దారుణమని నామా అన్నారు. దేశ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అదానీ అంశంపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని, ఇప్పటికైనా ప్రధాని మోదీ బాధ్యతగా స్పందించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.