నల్లబెల్లి, జూలై 3 : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గవ్యాప్తంగా పలు రోడ్ల నిర్మాణాలకు అధికారులు మొబైల్ శిలాఫలకాలను వినియోగించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రెండు రోజులుగా తారురోడ్లు నిర్మాణానికి శుంకుస్థాపన చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన వెంటనే ఆ ప్రదేశంలో వేసిన శిలాఫలకం మాయమవుతున్నది. గతంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు అధికారులు సిమెంట్‌తో పర్మినెంట్ శిలాఫలకాలను వాడేవారు. దీనికి భిన్నంగా నర్సంపేట నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఆర్అండ్బీ, పీఆర్ అధికారులు శిలాఫలకం మాదిరిగా ఫ్రేమ్ తరహా ఫ్లెక్సీని వాడుతున్నారు.
ఇటీవల చెన్నరావుపేట మండలంతోపాటు నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లో ఎమ్మెల్యే మాధవరెడ్డి రోడ్ల నిర్మాణ పనులకు శుంకుస్థాపన చేశారు. అక్కడ ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం.. అధికారులు మొబైల్ శిలాఫలకాన్ని క్షణాల్లో అక్కడి నుంచి తరలించారు. పనులు చేపట్టకుండానే శిలాఫలకాన్ని తొలగిస్తున్న అధికారుల తీరును గమనిస్తున్న ప్రజలు ఇదేంటని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయమై ఆర్అండ్బీ డీఈని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. ఏఈ గోపిని వివరణ కోరగా.. ఎమ్మెల్యే దొంతి ఆదేశాలతో సమయం లేనందున మొబైల్ శి లాఫలకాలను వినియోగిస్తున్నట్టు తెలిపారు.