Kodangal | వికారాబాద్, మార్చి 22, (నమస్తే తెలంగాణ)/కొడంగల్: ఎక్కడికక్కడ అడుగంటిన భూగర్భజలాలు.. మిషన్ భగీరథపై నిర్లక్ష్యంతో నిలిచిన నీటి సరఫరా.. తెల్లారితే ఊళ్లకు దూరంగా ఉన్న వ్యవసాయ బోరుబావుల వద్దకు బిందెలు, క్యాన్లతో పరుగులు.. అడుగంటిన బోరు బావుల నుంచి నీరు పట్టుకోకుండా అభ్యంతరాలు.. ఫలితంగా సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ ప్రాంతం గొంతెండుతున్నది. వేలాది కోట్లు ప్రకటించానని సీఎం చెప్పుకుంటున్నా, కడా పేరిట అభివృద్ధి అంటూ ఢంకా బజాయిస్తున్నా.. నియోజకవర్గ ప్రజలు మాత్రం తీరని దాహార్తితో నేడు నిత్యం అవస్థలు పడుతున్నారు.
ఇలా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా కొడంగల్ ప్రాంత పరిస్థితి మారింది. గత వారం, 10 రోజులుగా ఈ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నియోజకవర్గంలోని వివిధ తండాల గిరిజన మహిళలు, పిల్లాజెల్లలు కలిసి దూరానికి నడుచుకుంటూ వెళ్లి పొలాల నుంచి బిందెలతో తాగునీటిని తెచ్చుకుంటున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కడాకు రూ.వేల కోట్ల నిధులిచ్చామని ప్రచారం చేసుకుంటున్నా.. కనీసం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయకపోవడం శోచనీయమని ప్రజలు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందించి పదేండ్లపాటు ప్రజల దాహార్తిని తీర్చిన మాజీ సీఎం కేసీఆర్ పాలనను కొడంగల్ ప్రాంత ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
కొడంగల్ మండలంలోని టేకల్కోడ్, హస్నాబాద్, నిన్న ఆలేడ్, బొంరాస్పేట మండలం బోరబండ తండా, సూర్యనాయక్ తండాలో తీవ్ర తాగునీటికి కటకట ఏర్పడింది. తెల్లారితే చాలు తాగునీటి కోసం ప్రజలు వ్యవసాయ పొలాల్లోని బోరు బావుల వద్దకు పరుగులు తీస్తున్నారు. బోరు బావుల్లోనూ నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతుండటంతో పొలాల వద్ద నీటిని పట్టుకోనివ్వకుండా అభ్యంతరాలు తెలుపుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హస్నాబాద్ గ్రామంలో రెండురోజులకు ఓ సారి నీటి సరఫరా అవుతుండగా, ఆలేడ్ గ్రామంలో గత వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందని, నీటి సరఫరా జరిగినా ఒకటి, రెండు బిందెలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని స్థానికులు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోనూ నెలలో వారం రోజులు ఇదే పరిస్థితులు ఉన్నాయని స్థానికులు తెలిపారు. దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లోని వివిధ గ్రామాల్లోనూ తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెలలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఏప్రిల్, మే మాసాల్లో తాగునీటి కష్టాలు ఏ విధంగా ఉంటాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ధర్మాపూర్ గ్రామంలో ఏండ్ల నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని గుట్టల్లో పారే చెలిమ నీటితోనే గ్రామస్తులు దాహం తీర్చుకునేవారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా చెలిమ వద్ద బారులు తీరే పరిస్థితి ఉండేది. నేడు ఆ గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరా కొనసాగుతుండటంతో ప్రజలు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఇండ్ల వద్దే నీటిని పట్టుకొంటున్నారు. భగీరథ నీటి సరఫరా నిలిచిపోతే చెలిమ నీరే దిక్కని చెప్తున్నారు.
మళ్లీ నీళ్లకు తిప్పలు వచ్చింది. ఆ కాలంలో నీళ్లు రాక చేన్లకు వెళ్లే వాళ్లం. మళ్లీ ఇప్పుడు ఖాళీ బిందెలు పట్టుకొని చేన్లకు వెళ్లడం చాలా బాధగా ఉన్నది. ఇంట్లో పనులు వదులుకొని నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్లాల్సి వస్తున్నది. ఎండల్లో చేన్లకు వెళ్లి నీళ్లు తెచ్చుకోలేకపోతున్నం. నీళ్లు లేకుంటే పని కాదు. ఏమైనా చేసి నీళ్ల తిప్పలు లేకుండా చూడండి.
-భీమని బాయి, మేడిచెట్టు తండా, బొంరాస్పేట
మా తండాకు కేసీఆర్ నీళ్లు రావడం లేదు. పొద్దున్నే నీళ్లకోసం బిందెలు పట్టుకొని చేన్లకు పోతున్నం. బోర్ కాడ ఆ రైతు నీళ్లు పట్టుకోనివ్వడం లేదు. చేనుకు నీళ్లు సరిపోతలేదని బెదిరిస్తున్నరు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకెప్పుడు కూడా నీళ్ల తిప్పలు రాలేదు. ఇంటి వద్దే నీళ్లను పట్టుకునేది. అప్పుడు ఎండాకాలంలోనూ తిప్పలు కాలేదు. ఇప్పుడే ఎందుకు వస్తుంది. అప్పట్లాగనే ఇప్పుడూ నీళ్లివ్వండి సారూ.
– హేమీబాయి, రైతు, బోడబండ తండ, బొంరాస్పేట్
ఆలేడ్ గ్రామంలో గత నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా కొనసాగడం లేదు. ఎండలకు బోర్లలో కూడా నీళ్లు అంతంతగా వస్తున్నాయి. తాగునీటి కోసం వ్వవసాయ పొలాల వద్దకు పరుగులు పెడుతున్నాం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లకు తిప్పలు లేకుండే. కానీ ఇప్పుడు ఎండాకాలం రాగానే ఈ పరిస్థితి ఉంటే, అసలైన ఎండాకాలంలో పరిస్థితి ఏట్లుంటుందోనని భయమేస్తుంది.
– పల్లవి, ఆలేడ్, కొడంగల్
అప్పట్లో మిషన్ భగీరథ పథకం నీళ్లు కాక ముందు తాగునీళ్ల కోసం నానా తిప్పలు ఉండేది. మిషన్ భగరథ పైప్లైన్లు గ్రామానికి వచ్చిన పదేండ్లు ఇండ్ల వద్దే నల్లాల్లో నీళ్లను పట్టుకున్నం. మళ్లీ ఇప్పుడు నీళ్లకొసం పొలాలకు వెళ్లాల్సి వస్తున్నది. మరో రెండు నెలలు ఏవిధంగా ఉంటుందోనని భయంగా ఉన్నది. వారం రోజులుగా నీళ్లు లేవు. ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తున్నాం. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.
– దొడ్డికాడి లక్ష్మి, ఆలేడ్, కొడంగల్