11 సార్లు అధికారం ఇస్తే కాంగ్రెస్‌వాళ్లు ఏం పొడిచారు? కరెంట్ ఇయ్యలే. సాగునీరు ఇయ్యలే. ఏమీ చేయకుండా చావగొట్టినోళ్లే మళ్లీ ఒక చాన్స్ అడుగుతున్నరు. ఆ పార్టీకి ఓటేస్తే తెలంగాణ అంధకారమే
– కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తొందరపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ అంధకారమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. ‘సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనేది బీఆర్ఎస్ నినాదమైతే.. సంపద పెంచాలె, కుంభకోణాల కుంభమేళా చేయాలి, అందినోడికి అందినంత దండుకొని అవతల పడాలి అనేది కాంగ్రెస్ విధానం’ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతిచోటా ఏ టు జడ్ కుంభకోణాలేనని ధ్వజమెత్తారు. 55 ఏండ్లు అవకాశమిచ్చినా ఏమీ చేయని కాంగ్రెసోళ్లు.. ఇప్పుడు మళ్లొచ్చి ఒక్క చాన్స్ ఇవ్వమని సిగ్గులేకుండా అడుగుతున్నారని మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్, ఎంపీపీ నిర్మలా శ్రీశైలం గౌడ్ సహా వందలాది మంది బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గులాబీ కుటుంబంలోకి వచ్చాక ప్రతీ కార్యకర్తకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 11 సార్లు అధికారం ఇస్తే కాంగ్రెస్‌వాళ్లు ఏం పొడిచారని మళ్లీ అవకాశం అడుగుతున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ‘కరెంట్ ఇయ్యలే. తాగునీరు ఇయ్యలే. సాగునీరు ఇయ్యలే. ఏమీ చేయకుండా చావగొట్టినోళ్లే మళ్లీ ఒక చాన్స్ ఇవ్వండి ఏదో పొడిచేస్తం అని అడుగుతున్నారు’ అని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ పథకాలన్నీ కొనసాగిస్తామన్న బీజేపీ నేతల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేసీఆర్ పథకాలన్నీ కొనసాగించినంక మరి మీరేందుకు.. పీకనీకా..?’ అని ప్రశ్నించారు.
సంపద పెంచాలి…పేదలకు పంచాలి అనేది బీఆర్ఎస్ పార్టీ నినాదమైతే, సంపద పెంచాలె.. కుంభకోణాల కుంభమేళా చేయాలె అనేది కాంగ్రెస్ విధానమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతీచోటా ఏ టు జడ్ కుంభకోణాలేనని ఆరోపించారు. ‘తెలంగాణలో పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే. దేశ రాజకీయ వ్యవస్థను తల్లకిందులుచేసి అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన సంచలన నాయకుడు కేసీఆర్ ఒకవైపు.. సంచులు మోసే సన్నాసి మరోవైపు. రూ.50 లక్షలతో కెమెరాల ముందు అడ్డంగా దొరికినోడు.. జైల్లో చిప్పకూడు తిన్నోడు ఇయ్యాల పెద్ద పుడింగ్లాగా మనకు నీతులు చెప్తడా? పీసీసీ ప్రెసెడెంట్ అంటే అదేదో అమెరికా ప్రెసిడెంట్ అయినట్టు చెప్తాడు. 40 మంది అభ్యర్థులు కూడా దిక్కులేని పార్టీవాడు చెప్తే నమ్మాలా?’ అని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పడితే భూముల ధరలు పడిపోతయని ఆగం చేసే ప్రయత్నం చేశారని, కానీ నేడు కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లిలోనే ఎకరం భూమి రూ.1 కోటికి చేరిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనినిబట్టి సంపద పెరిగిందా? తరిగిందా? ఆలోచించాలని సూచించారు. ‘బీఆర్ఎస్ పాలనలో రైతులకు ధీమా పెరిగింది. రాష్ట్రంలో ఒక సామాన్యుడికి ఏ మూలన నాలుగెకరాల భూమి ఉన్నా ఇవ్వాళ కోటిశ్వరుడే. భూముల ధరలు పెరిగితే అభివృద్ధా? పడితేనే అభివృద్ధా? భూముల ధరలు పెరగటం వల్ల ఒక పంట కాలం కాకపోయినా రైతులకు ధీమా ఉంటుంది. తనకేమైనా అయితే భార్యాపిల్లలకు ఉన్న భూమిలో ఒక్క ఎకరం అమ్మినా బిడ్డ పెండ్లికి, కొడుకు వ్యాపారం పెట్టుకొనేందుకు సరిపోతుందనే ధీమా వచ్చింది. తెలంగాణ రాకముందు రూ.5 లక్షలకో.. రూ.10 లక్షలో ఉన్న ఎకరం భూమి రేటు నేడు 10 రెట్లు పెరిగింది. ఈ ధరలు ఊరికే పెరగలేదు. వ్యవసాయం బాగుపడి, 24 గంటల కరెంట్ అందుబాటులోకి రావడం వల్ల, బతుకులు బాగుపడ్డాయి. ప్రతీ ఊళ్లో కొత్త ఇండ్లు కట్టుకొంటున్నారు. రూ.లక్షలు ఖర్చుచేసి బొడ్రాయి పండుగలు సంబురంగా చేసుకొంటున్నారు’ అని వివరించారు.
కల్వకుర్తి అద్భుత చైతన్యం ఉన్న ప్రాంతమని, ఒకనాడు ఎన్టీ రామారావునే తిరస్కరించిన గడ్డ అని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ‘కల్వకుర్తి వాళ్లు బాగా తెలివైన వాళ్లు. కల్వకుర్తితో పెట్టుకున్నోడు ఎవడూ బాగుపడలేదు. తెలివైననోళ్లు తెలివిగల నిర్ణయం తీసుకోవాలి. అడ్డమైనోళ్లు అడ్డమైన మాటలు మాట్లాడితే ఆగం కావద్దు. రూ.4 వేల పెన్షన్ ఇస్తామని ఇవ్వాళ చెప్తున్న కాంగ్రెస్, అధికారంలో ఉన్నప్పుడు రూ.200 కూడా ఇవ్వలేకపోయింది. అలాంటివాళ్లు నాలుగు వేలిస్తామంటే నమ్ముదామా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది కులం ఫీలింగ్ అయితే బీజేపీది మంటలుపెట్టే మతం పిచ్చి అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
2014లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే, అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ను ధరలు అదుపులో పెట్టుకోలేని అసమర్థ ప్రధాని అని నరేంద్రమోదీ నిందించి అధికారంలోకి వచ్చారని, అదే సిలిండర్ ధరను రూ.1,200 చేసిన మోదీని ఏమనాలి? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘జన్‌ధన్ ఖాతాలు తెరిస్తే ఒక్కొక్కరి ఖాతాలో పంద్రాలాక్ వేస్తానని మోదీ చెప్పారు. కానీ పైసా కూడా వేయలేదు. పైసలు వేయని మోదీ తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు’ అని ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటేనే తెలంగాణకు శ్రీరామరక్ష అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టేనని అన్నారు. ‘కాంగ్రెస్, బీజేపీ బేకార్గాళ్లతోని ఏమీ కాదు. ఢిల్లీ గులాంలకు.. తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమిది. ఇలాంటి సన్నాసులు వచ్చి ఏదో మాట్లాడితే ఆగమాగం కావద్దు. గట్టిగా తకాయించి మాట్లాడాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపుతా అన్నోడే షెడ్డుకు పోయిండని కేటీఆర్ చురకలంటించారు. కేసీఆర్‌ను జైలుకు ఎందుకు పంపాలని ఆయన ప్రశ్నించారు. 76 ఏండ్లలో ఎవరూ చేయని విధంగా రైతుబంధు పథకం కింద రైతులకు రూ.73 వేల కోట్లు ఇచ్చినందుకు జైల్లో వేస్తవా? 24 గంటల కరెంట్ ఇస్తున్నందుకా? ప్రాజెక్టులు కట్టి బ్రహ్మాండంగా పాలమూరును పచ్చగజేసే ప్రయత్నం చేస్తున్నందుకా? ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గృహలక్ష్మి ఇస్తున్నందుకు వేస్తవా? అని ప్రశ్నించారు.
తలకొండ జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌కు సముచితస్థానం ఇచ్చి గౌరవిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. మంచి మనసుతో, సేవా దృక్పథంతో వచ్చేవారికి తప్పకుండా బీఆర్ఎస్లో ఉన్నత స్థానం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, నన్నపునేని నరేందర్, మాజీఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, సాక్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, కేశవరెడ్డి, గోపాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఒకసారి గులాబీ కుటుంబంలో సభ్యుడైన తరువాత అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటదని, ఏ స్థాయి వ్యక్తి అయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని కేటీఆర్ తేల్చిచెప్పారు. ‘పార్టీలో నలుగురికి నాలుగు రకాల ఆలోచనలు ఉండొచ్చు. టికెట్ నాగ్గావాలంటే నాగ్గావాలని అడుగొచ్చు. కానీ నియోజకవర్గంలో ఉన్నది ఒకటే బీ-ఫాం.. ఒకటే ఎమ్మెల్యే టికెట్టు. ఒక్క నియోజకవర్గంలో నాలుగు బీ-ఫాంలు ఇచ్చుడు ఉండదు. పార్టీ చాలా రకాల ఆలోచనలు చేసి.. చాలా రకాల వడబోత తర్వాత నిర్ణయం తీసుకుంటది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించిన తరువాత అందరం మన వ్యక్తిగత అభిప్రాయాలు, కోరికలు, వ్యక్తిగత ఆలోచనలు పక్కకు పెట్టి కేసీఆర్‌ను తిరిగి సీఎంను చేసేందుకు అభ్యర్థిని బల్లగుద్ది.. ఢంకా బజాయించి గెలిపించుకోవాలె’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.