న్యూఢిల్లీ: తప్పుడు ప్రకటనలతో యూపీఎస్సీ ఉద్యోగార్థులను మోసగించిన న్యూఢిల్లీకి చెందిన వాజీరావు అండ్ రెడ్డి ఇన్స్టిట్యూట్కు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) రూ.15 లక్షల జరిమానా విధించింది. 2023 యూపీఎస్సీ పరీక్షల్లో మొత్తం 1,1061 ఖాళీలకు 645 మంది తమ విద్యార్థులే ఎంపికయ్యారంటూ ఈ సంస్థ ప్రకటనలు ఇచ్చింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో దర్యాప్తు చేయగా ఈ కోచింగ్ సంస్థ బండారం బయటపడింది. వాస్తవానికి సంస్థ ప్రకటించిన 645 మందిలో 431 మంది అసలా సంస్థలోనే నమోదు కాని విషయాన్ని సీసీపీఏ గుర్తించింది.
2023 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సంస్థ నిర్వహించిన మాక్ ఇంటర్వ్యూ సెషన్‌కు కొందరు అభ్యర్థులు రాగా, వారంతా తమ వారే అన్నట్టు ఈ సంస్థ వారిని తమ ఖాతాలో వేసుకుంది. అందులో యూపీఎస్సీకి ఎన్నికైన వారు తమ సంస్థలోనే కోచింగ్ తీసుకున్నారంటూ 2024, ఏప్రిల్ 16న ప్రకటనలు ఇచ్చుకుంది. అదే విషయాన్ని వారి ఫొటోలతో సహా తమ వెబ్సైట్లో కూడా పొందుపరిచింది.