ముంబై: ధనాధన్‌కు పెట్టింది పేరైన టీ20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ దుమ్మురేపింది. లీగ్ దశ గెలుపు జోరును కీలకమైన సూపర్-8లోనూ కొనసాగిస్తూ జింబాబ్వేను చిత్తుచేసింది. సోమవారం వాంఖడే వేదికగా జరిగిన పోరులో విండీస్ 107 పరుగుల తేడాతో జింబాబ్వేపై భారీ విజయం సాధించింది. పసలేని జింబాబ్వే బౌలింగ్‌ను ఉతికి ఆరేస్తూ హార్డ్‌హిట్టర్ షిమ్రాన్ హెట్‌మైర్(34 బంతుల్లో 85, 7ఫోర్లు, 7సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీకి తోడు రోవ్‌మన్ పావెల్(35 బంతుల్లో 59, 4ఫోర్లు, 4సిక్స్‌లు) సమయోచిత ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 254/6 రికార్డు స్కోరు నమోదు చేసింది.
ఓవరాల్‌గా పొట్టి ప్రపంచకప్‌లో రెండో అత్యధిక టీమ్ స్కోరును విండీస్ దక్కించుకుంది. 54 పరుగులకే ఓపెనర్లు బ్రాండన్ కింగ్(9), షాయ్ హోప్(14) వికెట్లు కోల్పోయిన విండీస్‌ను హెట్‌మైర్, పావెల్ ఒడ్డున పడేశారు. టోర్నీలో తన సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తూ హెట్‌మైర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నగారవ(2/47), బ్లెస్సింగ్ ముజర్బని(2/42) రెండేసి వికెట్లు తీశారు. 255 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 స్కోరుకే కుప్పకూలింది. గుడకేశ్ మోతి(4/28), అఖిల్ హుసేన్(3/28) స్పిన్ ధాటికి జింబాబ్వే బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. బ్రాడ్ ఇవాన్స్(43) మినహా మిగతావాళ్లు ఘోరంగా తేలిపోయారు. అర్ధసెంచరీతో జట్టు భారీ స్కోరుకు కారణమైన హెట్‌మైర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
టాస్ గెలిచిన జింబాబ్వే..విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తాము తప్పు చేశామని తెలుసుకోవడానికి జింబాబ్వేకు పెద్దగా సమయం పట్టలేదు. విండీస్ ఓపెనర్లు స్వల్ప స్కోర్లకే ఔటైన ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హెట్‌మైర్ మ్యాచ్ గతిని మార్చేశాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హెట్‌మైర్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద జింబాబ్వే అరంగేట్రం ప్లేయర్ తశింగ ముసెకివా విడిచిపెట్టడం విండీస్‌కు కలిసి వచ్చింది. తనకు దక్కిన అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుంటూ హెట్‌మైర్ బ్యాట్‌కు పనిచెప్పాడు. అప్పటి వరకు చప్పగా సాగిన ఇన్నింగ్స్ హెట్‌మైర్ వీరవిహారంతో పతాకస్థాయికి వెళ్లింది.
బౌలింగ్ మార్పుగా వచ్చిన కెప్టెన్ సికిందర్ రజాను హెట్‌మైర్ ఓ ఆటాడుకున్నాడు. మూడు భారీ సిక్స్‌లతో హెట్‌మైర్ కొట్టిన కొట్టుడుకు వాంఖడే హోరెత్తిపోయింది. ఈ క్రమంలో 19 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. మరో ఎండ్‌లో రోవ్‌మన్ పావెల్..హెట్‌మైర్‌కు చక్కని సహకారం అందించాడు. సింగిల్స్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ హెట్‌మైర్ అవకాశాలు ఇస్తూ పోయాడు. మరోవైపు 70 పరుగుల వద్ద మరోమారు తశింగ క్యాచ్ విడిచిపెట్టడంతో రెండోసారి లైఫ్‌ను హెట్‌మైర్ విడిచిపెట్టుకోలేదు. ఈసారి అంతే కసిగా బౌండరీలు బాదగా, పావెల్ 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీమర్ బౌలింగ్‌లో హెట్‌మైర్ ఔట్ కావడంతో మూడో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత పావెల్, షెఫర్డ్(21), హోల్డర్(13) బ్యాటు ఝులిపించడంతో విండీస్‌కు భారీ స్కోరు సాధ్యమైంది.
భారీ ఛేదనలో జింబాబ్వే ఏ దశలోనూ లక్ష్యం వైపు సాఫీగా సాగలేదు. ఫోర్డె రెండో ఓవర్లోనే ఓపెనర్ మరుమని(14) ఔట్ కావడంతో జింబాబ్వే వికెట్ల పతనానికి నాంది పడింది. పిచ్‌పై అంచనాకు వచ్చిన విండీస్ కెప్టెన్..స్పిన్నర్లను దించడంతో జింబాబ్వే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్‌లో గుడకేశ్ మోతీ, మరో ఎండ్‌లో అఖిల్ హుసేన్..జింబాబ్వే బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. భారీ షాట్లు ఆడే క్రమంలో వికెట్లు సమర్పించుకున్నారు. ఓవైపు సహచరులు నిష్క్రమిస్తున్నా..కెప్టెన్ సికిందర్ రజా(27) నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ర్యాన్ బర్ల్(0), ముసెకెవా(0) సున్నాలు చుట్టగా, మోతీ బౌలింగ్‌లో రజా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆఖర్లో ఇవాన్స్ ఐదు భారీ సిక్స్‌లతో చెలరేగినా అంతరం తగ్గినా ఓటమి వైపు నిలువాల్సి వచ్చింది.