హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు 14 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుంచి 12 డిగ్రీల మధ్య నమోదయ్యాయని పే ర్కొన్నది.
దీంతో 14 జిల్లాలకు ఆ రెంజ్, 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 తక్కువగా నమోదయ్యే అవకాశమున్నదని పేర్కొన్నది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో విపరీతమైన చలిగాలుల వీస్తున్నాయని తెలిపింది. అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 5 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 6.9 డిగ్రీల నమోదైనట్టు వెల్లడించింది. మరో వారంపాటు ఇవే వాతావరణ పరిస్థితులు ఇలానే కొనసాగుతాయని వివరించింది.