హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో భవిష్యత్తు బీఆర్ఎస్దే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలే స్పష్టం చేశాయి. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వం కోసం, బీఆర్ఎస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట, ఘనపూర్ మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన 26 మంది నూతన సర్పంచులు శనివారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచులను హరీశ్‌రావు శాలువాలతో సతరించి అభినందించారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసుల బలంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, వాటిని తట్టుకొని నిలబడి విజయం సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచుల పోరాటపటిమ అద్భుతమని ప్రశంసించారు. కాంగ్రెస్ అధికార బలానికి ప్రజలు ఓటుతోనే గట్టి గుణపాఠం చెప్పారని స్పష్టంచేశారు. డబ్బు సంచులతో కాంగ్రెస్ నాయకులు ఎన్ని ప్రలోభాలు పెట్టాలని చూసినా, బెదిరింపులకు పాల్పడినా ప్రజలు మాత్రం గులాబీ జెండా వైపే నిలిచారని తెలిపారు. నామినేషన్ల దశ నుంచే తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని, ఏకగ్రీవాల పేరుతో బెదిరించారని, అయినా తమ నాయకులు, కార్యకర్తలు గులాబీ జెండాను వదలలేదని అభినందించారు.
తొలి విడత ఎన్నికల్లో గెలిచిన పంచాయతీ సర్పంచ్‌లు తమ గ్రామాల అభివృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని హరీశ్‌రావు కోరారు. ప్రజల పక్షాన నిలబడి, కొట్లాడి నిధులు సాధించుకుందామని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా, ఏ ఒక హామీని అమలు చేయలేదని, కేసీఆర్ ఇచ్చిన పథకాలకు కోతలు పెట్టారని మండిపడ్డారు. ఎందరో గిరిజన బిడ్డలు సర్పంచులుగా గెలువడం సంతోషకర మని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుభాశ్‌రెడ్డి, సీనియర్ నేత తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.