Indiramma Indlu | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం వేలాది మంది ప్రజాభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు. వారం రోజుల్లోనే ఏకంగా 5,562 దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా, క్షేత్రస్థాయిలో సర్వే చేసిన తర్వాతే ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రులు చెప్తున్నారు. ప్రజాభవన్‌కు వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపుతున్నామని అక్కడి అధికారులు ఆశ పెడుతున్నారు. ప్రజాభవన్‌లో దరఖాస్తు చేసిన ప్రతీఒక్కరి ఫోన్ నంబర్‌కు మెసేజ్ వస్తుండడంతో ‘హైదరాబాద్‌కు వెళ్లి దరఖాస్తు చేస్తే ఇల్లు మంజూరవుతుందేమో?’ అనే ఆలోచన జనంలో పెరిగిపోతున్నది. దీంతో వ్యయప్రయాసలకోర్చి ప్రజాభవన్ ముందు బారులు తీరుతున్నారు.
ఇంటి కోసం ఆశతో
నిరుడు డిసెంబర్ వరకు ప్రజావాణికి సగటున 500 దరఖాస్తులు వచ్చేవి. నెల మొత్తంలో ఇండ్ల కోసం 300కు మించి దరఖాస్తులు రాలేదు. కానీ ప్రస్తుతం రోజుకు 3వేల మందికిపైగా తరలివస్తున్నారు. ఈ నెల 10న ప్రజావాణిలో 3,348 దరఖాస్తులు రాగా, ఇందులో 2,871, 86 శాతం మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం చేసుకున్న దరఖాస్తులు ఉన్నాయి. శుక్రవారం ప్రజావాణిలోనూ 3,053 దరఖాస్తులు రాగా అందులో 2,691, అంటే 88శాతం దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసం చేసినవేనని స్పష్టమవుతున్నది.
ప్రభుత్వం విఫలం
గతంలో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా స్థలం ఉండి, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేస్తున్నారు. దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని గమనించిన ప్రజలు ప్రజాభవన్‌కు పోటెత్తుతున్నారు. ఇందిరమ్మ కమిటీల్లో ప్రధానంగా కాంగ్రెస్ నేతలకే చోటు కల్పించడం, ఇంచార్జి మంత్రి చెప్పిన వారికే ఇండ్లు ఇవ్వాలన్న నిబంధనలు ఉండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో దరఖాస్తు ఇస్తే ఇల్లు రాదేమోనని, ప్రజాభవన్‌కు వస్తేనే దరఖాస్తు పరిశీలిస్తారని భావిస్తున్నారు. దీంతో దూరప్రాంతాల నుంచి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వచ్చి అర్జీలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని ‘ఊర్లో ఉంటే ఇల్లు మంజూరవుతుందా? లేదా ప్రజాభవన్‌లో దరఖాస్తు చేసినవారికి ఇల్లు మంజూరవుతుందా? అనే అంశంలో స్పష్టమైన ప్రకటన చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.