KTR | అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. అవినీతి ఆరోపణలపై కూడా చర్చకు రెడీ అని పేర్కొన్నారు. ఈ – కార్ రేస్ అంశంపై కూడా చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు. దమ్ముంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
లగచర్ల రైతులనే కాదు.. సోషల్మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కూడా అరెస్టు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సోషల్మీడియాలో పోస్టులు పెడితే పీడీ యాక్ట్ పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. కొడంగల్ రైతులు కూడా రేవంత్ రెడ్డికి ఓటేశామని బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు. పట్నం నరేందర్ రెడ్డి, లగచర్ల రైతులను అరెస్టు చేసి 35 రోజులైందని తెలిపారు. నాంపల్లి కోర్టులో లగచర్ల రైతులు, పట్నం నరేందర్ రెడ్డి కేసులపై వాదనలు ముగిశాయని చెప్పారు. మనకు అనుకూలంగా తీర్పు రాకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వెళదామని స్పష్టం చేశారు. లగచర్ల రైతులకు న్యాయం జరిగేవరకు సర్కార్ను వదిలిపెట్టమని హెచ్చరించారు. కొడంగల్లో రేవంత్ రెడ్డిని తుక్కుతుక్కుగా ఓడించే సత్తా పట్నం నరేందర్ రెడ్డికి ఉందని కేటీఆర్ తెలిపారు. నరేందర్ రెడ్డి గుండె ధైర్యానికి సెల్యూట్ చేయాలని అన్నారు.
రేవంత్ రెడ్డి ఏడాది కింద రాష్ట్రమంతటా తిరిగి దొంగ హామీలు ఇచ్చారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై చర్చకు ఎక్కడికైనా సిద్ధమని స్పష్టం చేశారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ ఎక్కడైనా పూర్తయ్యిందా అని ప్రశ్నించారు. దీనిపై చర్చకు వస్తారా అని సవాలు విసిరారు. ఒక్క ఊళ్లో అయినా వంద శాతం రైతు రుణమాఫీ చేసినట్లు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఏడాది కడుపు కట్టుకుంటే 49 కోట్లు మాఫీ చేస్తామని రేవంత్ బీరాలు పలికారని అన్నారు. కానీ ఇప్పటివరకు రైతుల ఖాతాలో 13 కోట్లకు మించి పడలేదని చెప్పారు. వానాకాలంలో రైతుభరోసాను ఎగ్గొట్టిండని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఇచ్చిన రూ.10వేల రైతుబంధు కూడా ఇవ్వడం లేదని అన్నారు.
రాహుల్ గాంధీ నుంచి మొదలుపెడితే కాంగ్రెస్ నేతలు చెప్పినవన్నీ అబద్ధాలే అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్కు ఓటేసినందుకు ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేందుకు ఏదైనా ఉపాయం ఉందా అని ప్రజలంతా అడుగుతున్నారని తెలిపారు. నీలి రంగు నక్కను ఎప్పుడు వదిలించుకుందామా అని తెలంగాణ సమాజం ఎదురుచూస్తోందని తెలిపారు. రోషం ఉన్నవాడైతే ప్రజల తిట్లకు రేవంత్ రెడ్డి ఎప్పుడో చచ్చిపోతుండే అని ఎద్దేవా చేశారు.