హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): సున్నంచెరువు పరిసరాల్లో పేదల ఇండ్లను కూల్చివేయడంపై ప్రజలు తీవ్రఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడుతున్నారు. ఇంట్లోని సామగ్రిని కూడా తీసుకోనివ్వకుండా దొంగల్లా వచ్చి బుల్డోజర్లతో ఇండ్లను నేలమట్టం చేయడం దుర్మార్గమైన చర్య అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు.. భారీ భవనాలను వదిలిపెట్టి, పేదల ఇండ్లపై హైడ్రా పేరిట క్రూరంగా ప్రవర్తిస్తున్నారని భోరున విలపించారు. నిరుపేదలపై కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలకులు పేదలను ప్రశాంతంగా బతకనీయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుపేదలను రోడ్డున పడేసి ఉసురు తీస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. రేవంత్‌రెడ్డి పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పెద్దలను వదిలి.. పేదలపైకి బుల్డోజర్లా?: కేటీఆర్
సున్నంచెరువు వద్ద కూల్చివేతలకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘నువ్వు కొడంగల్‌లో రెడ్డికుంటను పూడ్చి మహల్ కట్టవచ్చు.. మీ అన్న తిరుపతిరెడ్డికి దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఇల్లు ఉండవచ్చు.. మీ రెవెన్యూ మంత్రి హిమాయత్‌సాగర్‌లో ప్యాలెస్‌లు కట్టవచ్చు.. మీ చీఫ్‌విప్ మహేందర్‌రెడ్డి చెరువు నడుమ గెస్ట్‌హౌజ్ కట్టవచ్చు.. కేవీపీలాంటి పెద్దలు చెరువు బఫర్‌లో గెస్ట్ హౌజ్‌లు కట్టుకోవచ్చు.. పెద్ద బిల్డర్లు మీకు లంచం ఇచ్చి, మూసీ నదిలోనే అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు.. కానీ నీకు, హైడ్రాకు ఇవేమీ కనబడవు’ అంటూ నిప్పులు చెరిగారు. పేదలు తమ ఇండ్లు కూల్చొద్దని, హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తినోరు మొత్తుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గం అని మండిపడ్డారు.
తెలంగాణలో బుల్డోజర్‌రాజ్ నడవదు: హరీశ్
సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు బలగాలతో పేదల జీవితాలను నాశనం చేస్తున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బుల్డోజర్‌రాజ్ నడవదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశమంతా తిరుగుతూ బుల్డోజర్రాజ్కు వ్యతిరేకంగా మొహబ్బత్‌కా దుకాణ్ నినాదం ఇస్తుంటే తెలంగాణలో రేవంత్‌రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహిస్తున్నారని నిప్పులుచెరిగారు. తమ ఇండ్లు కూల్చొద్దని, కోర్టు స్టే ఆర్డర్ ఉందని బాధితులు చెప్పినా క్రూరంగా, కనికరం లేకుండా చట్టాలను, కనీస మానవత్వాన్ని మర్చిపోయి వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి తీరుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.