సిద్దిపేట, జులై 02 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మెదక్(Medak) జిల్లాలో నకిలీ మందుల(Fake medicines) దందా జోరుగా కొనసాగుతున్నది. ఆయా మందుల దుకాణాల్లో దొరుకుతున్న మందులలో ఏవి నకిలీవో..ఏవి అసలివో తెలియని పరిస్థితి నెలకొంది. మెడికల్ షాపు యజమానులు నకిలీ మందులు అమ్మి అందినకాడికి ప్రజల నుండి దోచుకుంటున్నారు. అధికారుల అండదండలతో ఇష్టారీతిగా వ్యవహ రిస్తున్నారు. అసలు జిల్లాలో డ్రగ్స్ అధికారులు ఉన్నారా ? లేరా? ఉంటే వారి కార్యాలయాలు ఎక్కడ ఉన్నవో తెలియని పరిస్థితి జిల్లాలో ఉంది. వారికి నెల నెల మాముళ్లు అందితే చాలు. ఇక ఆమెడికల్ షాపుల వైపు సైతం కన్నెత్తి చూడరు.
చాలా వరకు మందుల షాపుల్లో సర్టిఫికెట్ ఒకరిది నిర్వాహణ మరోకరిది..ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుంది. అనుమతులు లేకుండా ఇష్టారీతిగా మందుల దుకాణాలు వెలుస్తున్నాయి. ఐనప్పటికి ఏమాత్రం చర్యలు ఉండవు. వర్షాకాలం ప్రారంభమైంది. ఓ వైపు జిల్లాలో వైరల్ జ్వరాలు వస్తున్నాయి. దీనిని ఆసరాగా చేసుకున్న కొంత మంది ఆర్ఎంపీలు, ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్ యజమానులు కుమ్మక్కై వారి కనుసన్నల్లోనే మెడికల్ షాపులు పెట్టి నకిలీ మందులను తీసుకవచ్చి అమ్ముతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
జ్వరం, దగ్గు, నొప్పులు, బీపీ, షుగర్ తదితర వాటికి వివిధ మెడికల్ షాపుల్లో నకిలీ మందులు రాజ్య మేలుతున్నాయి. నిత్య జీవితంలో విరివిరగా వాడుతున్న మందులను టార్గెట్ చేసుకొని ఆ మందులనే నకిలీవి తెచ్చి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ మందుల్లో నకిలివి, అసలివో గుర్తుపట్టరాకుండా ఉంటున్నాయి. వీటికి తోడు కాలం చెల్లిన మందులను సైతం నిరక్ష్యరాస్యులకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
మెడికల్ షాపులపై నియంత్రణ కరువు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా జిల్లాలోనే ఈ పరిస్థితులు ఇలా ఉంటే మిగితా ప్రాంతాల్లో ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అనుముతులు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా మందుల షాపులు వెలుస్తున్నా అడిగే వారే లేరు. ఉమ్మడి జిల్లాలో సరాసరిగా సిద్దిపేట జిల్లాలో 750, మెదక్ జిల్లాలో 550, సంగారెడ్డి జిల్లాలో1300 వరకు మెడికల్ షాపులు ఉన్నట్లు సమాచారం. ఇవి కాకుండా ఇతర చిన్న చిన్న షాపులు కుడా ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో నకిలీ మందులు వస్తున్నాయి. అరికట్టాల్సిన అధికారులు పూర్తిగా చేతులేత్తేశారు. మాకేంది లే…మాకు నెల నెల మామూళ్లు వస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఒక వైద్యారోగ్య శాఖనే కాదు ప్రధానమైన అన్ని శాఖల తీరే ఇలానే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలన పూర్తిగా గాడి తప్పి పోయింది. అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. శాఖా పరమైన పనులు పక్కన పెట్టి పూర్తిగా సొంత పనులు, వ్యాపారాలపై దృష్టి సారించారు. అయా మెడికల్ షాపులపై నియంత్రణ కరువైంది. అడిగే వారు లేక పోడంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం సరిగా అందడం లేదు. దీంతో ప్రైవేట్ దవాఖానలోకి ప్రజలు వెళ్లుతున్నారు. అక్కడికి వెళ్లితే అక్కడ ఇష్టం వచ్చిన రితీలో ఫీజులు గుంజుతున్నారు. అందినకాడికి మందులలో వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖనాల్లో అంతంతనే వైద్యం అందుతుంది. క్షేత్ర స్థాయిలోపర్యవేక్షణ కరువైంది. మందుల కొరత, వైద్యులు సకాలంలో వైద్యం అందించడం లేదు.
అధికారులు ఎక్కడ ఉన్నారో తెలియదు..?
ఉమ్మడి మెదక్ జిల్లాలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ఎక్కడ ఉన్నారో తెలియదు. జిల్లాకు ఓ అధికారి ఉన్నారు అని చెప్పడం వరకే ..కానీ జిల్లాలో ఉండరు. ఇదేంటి అంటే మాకు ఇతర జిల్లాల ఇన్చార్జీ బాధ్యతలు ఉన్నాయి. తాము అక్కడ కూడా చూసుకోవాలి కదా అంటూ సమధానాలు చెబుతారు. దీంతో మెడికల్ షాపుల మీద పూర్తిగా నియంత్రణ కరువైంది. మెడికల్ షాపు యూనియన్లు ఏది చెపితే అది వినడమే అధికారుల వంతు.
ఒక్కో షాపుల్లో నకిలీ మందులు ఉన్నా అధికారులు పట్టించుకోరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సంబంధిత అధికారులులకు మెడికల్ షాపుల నుండి మామూళ్లు నెల నెలా అందుతున్నాయి. దీంతో వారు చెప్పినట్లు అధికారులు నడుచుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. నకిలీ మందులను నియంత్రించాల్సిన అధికారులే మామూళ్లకు అలవాటు పడడంతో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి.