హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): ఇలా ఒక్క వల్లభనగర్ రిజిస్ట్రార్ కార్యాలయమే (Sub Registrar office) కాదు.. రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ (Slot Booking) విధానం అలంకారప్రాయంగా మారింది. ప్లాట్లు, గృహ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా అమలుచేసిన స్లాట్ బుకింగ్ విధానం మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. పేరుకే స్లాట్ బుకింగ్ అమలవుతున్నది. కానీ బుక్ చేసుకున్న సమయంలో మాత్రం రిజస్ట్రేషన్లు కావడమే లేదు. గతంలోకనీసం రెండు మూడు గంటల్లో అయినా రిజిస్ట్రేషన్ పూర్తయ్యేవని, కానీ ఇప్పుడు అంతకు రెట్టింపు సమయం పడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అమ్మకందారులు, కొనుగోలుదారులకు సమయం ఆదా సంగతి దేవుడెరుగు, మరింత ఆలస్యమవుతున్నదనే గుబులు పట్టుకున్నది.
రిజిస్ట్రేషన్ల కోసం ఇకపై క్యూలైన్లకు గుడ్‌బై చెప్పబోతున్నాం.. అని స్లాట్ బుకింగ్ విధానం అమలు రోజున మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా స్లాట్ బుకింగ్ ద్వారా కేవలం 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయని తెలిపారు. కానీ మంత్రి చెప్పిన ఏ ఒక్కటీ నిజం కాలేదు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం డీలా పడిన విషయం అందరికీ తెలిసిందే. క్రయ విక్రయాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. పైగా స్లాట్ బుకింగ్ విధానం అమలులో ఉన్నది. ఇలాంటి సమయంలోనూ రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద అమ్మకందారులు, కొనుగోలుదారులు గంటలపాటు పడిగాపులు ఉండాల్సిన పరిస్థితి దాపురించడం గమనార్హం.
సబ్ రిజిస్ట్రార్ల ఇష్టారాజ్యం!
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ విధానాన్ని సబ్ రిజిస్ట్రార్లు నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్లాట్ బుకింగ్ విధానం విఫలం కావడానికి సబ్ రిజిస్ట్రార్లు సమయ పాలన పాటించకపోవడమే ప్రధాన కారణమనే అభిప్రాయాలున్నాయి. ఈ విమర్శలకు తగ్గట్టుగానే సబ్ రిజిస్ట్రార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరూ సమయ పాలన పాటించడం లేదు. ఆఫీసుకు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో? తెలియని పరిస్థితి నెలకొన్నది. దీంతో స్లాట్ బుకింగ్ చేసుకున్న క్రయవిక్రయదారులు సంతకాల కోసం సబ్ రిజిస్ట్రార్లు వచ్చే వరకు వేచి ఉండాల్సి వస్తున్నది. తమకు మీటింగ్‌లు ఉన్నాయని, మంత్రి పిలిచారని, అసోసియేషన్ నాయకులు రమ్మన్నారని, హెడ్ ఆఫీసు నుంచి కాల్ వచ్చిందని.. వివిధ కారణాలతో డుమ్మా కొడుతున్నట్టు తెలిసింది. కనీసం ఆఫీసుకు వచ్చిన తర్వాతైనా వేగంగా పనిచేస్తున్నారా? అంటే అదీ జరగడం లేదనే విమర్శలున్నాయి. సబ్ రిజిస్ట్రార్ల నిర్లక్ష్యం, పట్టింపులేనితనంతో స్లాట్ బుకింగ్ విధానం అట్టర్‌ప్లాఫ్ కావడంతో పాటు క్రయవిక్రయదారులకు తిప్పలు తప్పడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆస్తి మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకొని వల్లభనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లాం. కేవలం 20 నిమిషాల్లోనే పని పూర్తయింది. 3 నెలల క్రితం ఇదే ఆఫీసుకు రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే 3 గంటల సమయం పట్టింది. స్లాట్ బుకింగ్ విధానంతో మా సమయం ఆదా అయింది.
-ఇదీ ఏప్రిల్ 10వ తేదీన స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి వచ్చిన రోజున ఒకరి అభిప్రాయం.
ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ కోసం ఇదే వల్లభనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు ఇటీవల ఓ వ్యక్తి వెళ్లారు. ఉదయం 12 గంటలకు స్లాట్ బుకింగ్ చేసుకోగా సాయంత్రం 4 గంటలకు రిజిస్ట్రేషన్ పూర్తయింది.
– ఇదీ ప్రస్తుతం అదే వల్లభనగర్ ఆఫీసులో స్లాట్ బుకింగ్ పనితీరు.