హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా వికారాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ గెస్ట్ లెక్చరర్ల వేతనాలను చెల్లించకుండా ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా పెండింగ్ పెట్టిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ఎక్స్ వేదికగా బుధవారం డిమాండ్ చేశారు. పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించకుండా, గెస్ట్ లెక్చరర్లు.. వారంతట వారే ఉద్యోగాలు మానేసే విధంగా పరిస్థితులు కల్పించడం కాంగ్రెస్ సర్కారు దుర్మార్గపు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. జీతాలు అందకపోవడంతో బతుకమ్మ, దసరా పండుగలు కూడా జరుపుకోకుండా, గెస్ట్ లెక్చరర్లు పస్తులుండేలా చేసిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే వారి కుటుంబ పోషణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో, ఓపిక నశించి, చివరకు వారు కాలేజీలకే వెళ్లకూడదన్న నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు. ఇక విద్యార్థులకు పాఠాలు ఎవరు బోధిస్తారు? సిలబస్ ఎవరు పూర్తిచేస్తారని సర్కార్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గెస్ట్లెకరర్లతోపాటు విద్యార్థులు కూడా నష్టపోవాల్సిన పరిస్థితులు వచ్చాయని మండిపడ్డారు.
గురుకులాల్లో మరణమృదంగం ఆపలేరా? అని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు నిలదీశారు. బడికి పంపిన పిల్లలు విగతజీవులుగా మారుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోతున్నదని విమర్శించారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గురుకులంలో 8వ తరగతి విద్యార్థి వివేక్ అనుమానస్పద మృతికి కారణం ఏమిటని సర్కార్‌ను నిలదీశారు.