హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): మొన్నటి వ్యవసాయ సమీక్షలో పంట బోనస్‌కు కోతలుపెట్టిన రేవంత్ సర్కార్.. గురువారం నిర్వహించిన డిజిటల్ క్యాబినెట్ భేటీలో ధాన్యం కొనుగోళ్లు చేయలేమని చేతులెత్తేయడం రైతాంగాన్ని దారుణంగా మోసగించడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజుకో వింత నిర్ణయం, చెత్త విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బతుకును చిత్తు చేస్తున్నదని, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసక విధానాల ద్వారా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నదని మండిపడ్డారు. ఇకపై పాత విధానంలో కొనుగోళ్లు కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పడమంటే ధాన్యం కొనుగోళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి పంటలు కొనుగోలు చేయడం చేతకాదా? అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతు కోస్తున్నారని ప్రశ్నించారు. పంటల కొనుగోళ్లపై రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పంటలు కొనుగోలు చేయలేమని మీడియా సాక్షిగా రాష్ట్ర క్యాబినెట్ ఒప్పుకొన్నదని, పంటను ప్రభుత్వం కొనకపోతే, పండిన పంటను రైతులు ఏం చేయాలి? ఇంట్లో దాచుకోవాలా? అని ప్రశ్నించారు. రైతుల బతుకులతో సర్కార్ ఆటలాడుతున్నదని విమర్శిం చారు. కోటాల పేరుతో కొనుగోళ్లకు పరిమితులు విధించడం రైతులను మారెట్ దళారుల దయాదాక్షిణ్యాలపై వదిలేయడమేనని మండిపడ్డారు.
కేసీఆర్ రైతన్నను రాజుగా చేస్తే, రేవంత్‌రెడ్డి వారిని దివాలా తీసే కుట్రలు చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. పంట బోనస్ రావాలంటే ఏడు రకాల సన్నాలు మాత్రమే సాగు చేయాలని చెప్పడమంటే సాగుపై ఆంక్షలు విధించడమేనని దుయ్యబట్టారు. ‘పంట మార్పిడీ చేయండని మీరు చెప్పిన మాటలు నమ్మి జొన్న, మకజొన్న, పొద్దుతిరుగుడు, శనగలు పండించిన రైతుల పరిస్థితి రోడ్డు పాలైంది. ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం షరతులు, పరిమితులు విధిస్తే రైతుల బతుకులు ఆగమవుతాయ’ని ఆందోళన వ్యక్తంచేశారు. రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, పంట బోనస్, కొనుగోళ్లు, నీటి సరఫరా, కరెంట్ సరఫరా ఇలా అన్నింటిలో కోతలు పెడుతూ రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.
ప్రాజెక్టుల్లో తెలంగాణకు రావాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వదిలేసి, ఇప్పుడు రైతులకు ‘నీళ్లు లేవు కాబట్టి పంటలు చూసుకొని వేయండి’ అని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎల్‌నినో ప్రభావంపై నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కృష్ణా జలాలపై త్రిసభ్య కమిటీ సమావేశానికి ముందే తెలంగాణలో నీటి కొరత ఉన్నదని, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అధికంగా నీటిని తరలించిందని లేఖలు రాసినా, మళ్లీ 10 టీఎంసీల నీటిని ఏపీకి ఎందుకు వదిలారని ఆయన మండిపడ్డారు.
సాకులు, సమస్యలంటూ పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తే తెలంగాణ రైతాంగం నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు. పంట కొనుగోళ్లు చేయకపోతే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై డిజిటల్ క్యాబినెట్ పేరుతో తీసుకొన్న రైతు వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుభరోసా విడుదల చేయడానికి బహిరంగ సభలు ఎందుకని ప్రశ్నించారు. గత యాసంగిలో రెండు సభలు పెట్టి రెండెకరాలకు వేసి చేతులు దులుపుకొని, ఇప్పుడు మరోసారి బహిరంగ సభ పెట్టి రైతుభరోసా వేస్తామనడం హాస్యాస్పదమని విమర్శించారు. ఈ వానకాలానికి సంబంధించిన రైతుభరోసా నిధులతోపాటు గతంలో పెండింగ్‌లో ఉంచిన మూడు విడతల రైతుభరోసా బకాయిలు మొత్తం రూ.16,545 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఈ నెల 30న మధిర వేదికగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు.