గంగాధర, ఏప్రిల్ 16 : ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి, రాష్ర్టాన్ని అధోగతిపాలు చేసిన కాంగ్రెస్ పార్టీ పతనం జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని జగిత్యాల సభ చొప్పదండి నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న సభ సందర్భంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో గురువారం చొప్పదండి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి చేరిక సందర్భంగా నిర్వహిస్తున్న జైత్రయాత్ర సభ జన సముద్రాన్ని తలపించాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాకంటక పార్టీగా మారిందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న రేవంత్‌రెడ్డి సరార్‌పై మరో పోరుకు కేసీఆర్ జగిత్యాల నుంచే శ్రీకారం చుడుతున్నారని తెలిపారు.
‘కేసీఆర్ రావాలి.. రేవంత్‌రెడ్డి పోవాలి’ అనే నినాదంతో జగిత్యాల జైత్రయాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ జగిత్యాల సభకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండల, గ్రామ స్థాయి నాయకులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఒకరూ తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు.